Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరుకున్న దానికి భిన్నమైన మీటింగ్ చెన్నైలో జరిగిందట

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:27 AM GMT
కేసీఆర్ కోరుకున్న దానికి భిన్నమైన మీటింగ్ చెన్నైలో జరిగిందట
X
అన్ని అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది. అనిశ్చితికి మారుపేరుగా.. ఎప్పుడేం జరుగుతుందో ఏ మాత్రం ఊహించని రీతిలో ఉండే రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయ రంగంగా చెప్పాలి. అనుకున్న దానికి.. అంచనాకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకోవటం పాలిటిక్స్ లో మామూలే అన్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు తెలంగాణకు మాత్రమే పరిమితమైన టీఆర్ఎస్ అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానంటూ ప్రకటనలు చేయటం.. అందుకు తగ్గట్లే.. రెండు వారాల క్రితం మహారాష్ట్రకు వెళ్లి.. ఆ రాష్ట్ర సీఎంతో పాటు.. సీనియర్ నేత.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ కావటం తెలిసిందే.

మాంచి జోరు మీద ఉన్న కేసీఆర్.. మహారాష్ట్ర పర్యటన తర్వాత కాస్తంత కామ్ కావటమే కాదు.. అంతకు ముందు మాదిరి ప్రధాని మోడీ మీద ఇష్టారాజ్యంగా విరుచుకుపడటం.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే మాటలు మాట్లాడకపోవటం తెలిసిందే. బీజేపీ.. కాంగ్రేసేతర కూటమిని కట్టి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తున్న ఆయన.. అందుకు సంబంధించిన భారీగా వర్కువుట్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అది రాజకీయం ఎందుకు అవుతుంది? అన్న మాటకు తగ్గట్లే తాజాగా అనూహ్య భేటీ ఒకటి చోటు చేసుకుంది.

కేసీఆర్ సిద్ధం చేయాలనుకుంటున్న జాతీయ కూటమిలో కీలకమైన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ డీఎంకే అధినేత స్టాలిన్ తాజాగా భేటీ అయిన ఒక సమావేశం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు. ఆయన కోరుకుంటున్నట్లుగా కాంగ్రెస్.. బీజేపీయేతర కూటమిని కట్టాలన్న ఆయన వాదనకు భిన్నంగా తాజా భేటీ సాగినట్లుగా చెబుతున్నారు. మాజీ కేంద్రమంత్రి.. యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన చిదంబరం గంటకు పైనే స్టాలిన్ తో సమావేశం కావటం గమనార్హం. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించటం.. ఈ నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలిపేందుకు చిదంబరం సీఎం స్టాలిన్ తో సమావేశమైనట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే డీఎంకే కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్.. తాజా భేటీతో కేసీఆర్ కు కాస్తంత నిరాశ కలిగేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.