Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కు మెగా క్యాంప్ హ్యాండిచ్చిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   27 March 2019 5:42 AM GMT
ప‌వ‌న్ కు మెగా క్యాంప్ హ్యాండిచ్చిన‌ట్లేనా?
X
ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటాల‌ని త‌పిస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్. ఒక్క‌డిగా పార్టీని స్థాపించిన ఆయ‌న‌.. ఇప్ప‌టివ‌ర‌కూ మెగా క్యాంప్ సాయాన్ని తీసుకున్న‌ది లేదు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ అయినా.. కాసింత ప్ర‌చారానికి మెగా హీరోలు వ‌స్తారా? అన్న ప్ర‌శ్న‌కు నో అన్న స‌మాధానం వినిపిస్తోంది.

ప‌వ‌న్ అన్న చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన వేళ‌.. ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాష్ట్రం మొత్తం విస్తృతంగా ప‌ర్య‌టించ‌ట‌మే కాదు.. అన్న త‌ర‌ఫున పెద్ద ఎత్తున ప్ర‌చారాన్ని చేప‌ట్టారు. ఇదేం రాజ్యం.. ఇదేం రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగ‌ల రాజ్యం.. అంటూ నిన‌దించ‌ట‌మేకాదు.. కాంగ్రెస్ వాళ్ల‌ను పంచెలూడిపోయేలా త‌రిమిత‌రిమి కొట్టాలంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌టి రాజ‌కీయ సంచ‌ల‌నానికి తెర తీశాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి.. నాడు చిరుకు అంత‌గా అండ‌గా నిలిచిన ప‌వ‌న్ కు.. మెగా హీరోలు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపించింది.

అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకోవ‌టం.. ముగియ‌టానికి మ‌రో రెండు వారాల స‌మ‌యం కూడా లేని వేళ‌.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్నిచూస్తే.. మెగా హీరోలంతా ప్ర‌చారానికి దూరంగా ఉంటార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తండ్రికి ద‌న్నుగా నిలిచేందుకు ఆయ‌న కుమారుడు.. యువ హీరో వ‌రుణ్ తేజ సైతం ప్ర‌చారానికి దూరంగా ఉండ‌నున్నారు. తాజాగా ఆయ‌న సినిమా షూట్ విదేశాల్లో జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న అందులో బిజీగా ఉన్నార‌ని.. ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌ర‌ని చెబుతున్నారు.

తండ్రి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న వేళ‌.. విదేశాల నుంచి వ‌చ్చి మ‌రీ కొడుకులు ప్ర‌చారం చేయ‌టం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ చూశాం. దీనికి భిన్నంగా త‌న సెల‌బ్రిటీ తండ్రిఎన్నిక‌ల బ‌రిలో నిలిస్తే.. సినిమా షూట్ కోసం ఫారిన్ టూర్ కు వ‌రుణ్ తేజ్ వెళ్ల‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మెగాక్యాంప్ ను దిశానిర్దేశం చేసే చిరు సూచ‌న మేర‌కే మెగా హీరోలంతా ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న సున్నిత అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొన్న చిరంజీవి.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. చిరు మాట‌తో మెగా క్యాంప్ మొత్తం ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌క్క‌న పెట్టేసి.. ఎవ‌రికి వారు త‌మ ప‌నుల్లో మునిగిపోయిన‌ట్లుగా తెలుస్తోంది.