Begin typing your search above and press return to search.

మేఘా సిగలో ఇంటింటా గ్యాస్..

By:  Tupaki Desk   |   8 Jun 2018 5:47 AM GMT
మేఘా సిగలో ఇంటింటా గ్యాస్..
X
దేశంలో తొలిసారిగా గృహ - వాణిజ్య అవసరాలకు గ్యాస్ను సరఫరా చేసే ప్రాజెక్ట్ మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా - కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాలలో ప్రారంభిస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రాజెక్ట్ పనితీరును పరీక్షించింది. త్వరలో వీటిని అధికారికంగా ప్రారంభించనుంది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో ఆగిరిపల్లి - కానూరుల్లో ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందుకు అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ సిద్ధమైంది. అదే విధంగా కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాల్లోనూ ప్రారంభిస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గృహ - వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ (మేఘా గ్యాస్) సరఫరా చేయటం ద్వారా జీవన ప్రమాణాలను - సమాజంలో ఇన్ ఫ్రా ఫలాలు నేరుగా అందించేందుకు ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. గ్రీన్ ఫ్యూల్ - క్లీన్ ఫ్యూల్ అనే నినాదంతో ఎంఈఐఎల్ మూడు జిల్లాలోనూ ముందడుగు వేస్తోందని మెయిల్- హైడ్రోకార్బన్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్వరరెడ్డి తెలిపారు. పారిశ్రామిక - రవాణా అవసరాలు తీర్చే విధంగా కూడా మౌలిక వసతులను ఇప్పటికే ఏర్పాటు చేసింది.

ఇందుకు అవసరమైన గ్యాస్ ను ఓఎన్జీసీ - గెయిల్ నుంచి పొందనుంది. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో ఇటీవలనే గ్యాస్ వాణిజ్యపరమైన ఉత్పత్తిని ఓఎన్జీసీ ప్రారంభించింది. ఈ కేంద్రం నుంచి 90వేల ఎస్సిఎండీ (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్డే) గ్యాస్ పొందే విధంగా త్వరలో ఒప్పందం ఓఎన్జీసీతో మేఘా కుదుర్చుకోనుంది.

మేఘా గ్యాస్ ఇట్స్ స్మార్ట్ - ఇట్స్ గుడ్ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను ప్రారంభిస్తోంది. మేఘా గ్యాస్ గృహాలు - వాణిజ్య సంస్థలు - పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందించనుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలోని బెల్గాం - తూంకూరు జిల్లాల్లో మేఘా గ్యాస్ అందించనుంది. ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ - ఎండిపీఈ పైప్లను 571 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసారు. ఈ పైప్ లైన్ ఆగిరిపల్లి - తోటపల్లి - బి బి గూడెం - గొల్లనపల్లి - సూరంపల్లి - కేసరపల్లి - నున్న బైపాస్ - ఎనికేపాడు - పోరంకి - నూజివీడు - ముస్తాబాద - గన్నవరం - చొప్పరమెట్లలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని గృహాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. ఈ ఏడాది మరికొన్ని వాణిజ్య సంస్థలకు గ్యాస్ సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను మేఘా గ్యాస్ చేసింది.

కర్ణాటకలోని తూంకూరు జిల్లాలో కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లను మేఘా గ్యాస్ చేసింది. వక్కోడి - హెగ్గేరి - గోళ్లహళ్లి - గొల్లరహతి - కుప్పూరు - దసముద్దేప్యా - సిరగతే - దిబ్బుర్ - గుళురు - సంతపేట - మరురూర్ దీన్నే - శేట్టిహళ్లి - జయనగర్ - గోకుల్ ఎక్స్ టెన్షన్ - ఖ్యాతిసాండ్రా - హీరేహళ్లి ఏరియా - మంచికల్ కుప్పె - బట్వాడీ - హనుమంతపురలో 300 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేసింది. సదాశివ నగర్ - బనశంకరి - మండిపేట్ - గాంధీ నగర్ - చిక్పేట తదితర ప్రాంతాల్లో 75 కిలోమీటర్ల మేర ఎండిపీ ఈ పైప్ లైన్ మేఘా గ్యాస్ ఇప్పటికే ఏర్పాటు చేసింది. అలాగే బెల్గామ్ జిల్లాలో బసవన్న కోళ్ల - ఆటోనగర్ - రాంతీర్థనగర్ - అశోక సర్కిల్ - ఆజాద్ నగర్ - చెన్నమ్మ సర్కిల్ - మారుతీ నగర్ - సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో 350 కిలోమీటర్ల మేర స్టీల్ - ఎండిపీ ఈ పైప్ లైన్ వేశారు. ఈ జిల్లాలో 50 వేల స్టాండర్ద్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను వినియోగించనున్నారు.

మేఘా గ్యాస్ వినియోగదారులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండడం కోసం వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ తో పాటు వెబ్ సైట్ ను మేఘా గ్యాస్ రూపొందించింది. వినియోగదారులకు ప్రత్యేకంగా లాయల్టీ కార్డును మేఘా గ్యాస్ అందించనుంది. ది మోర్ యూ యూజ్ మోర్ యూ గైన్ అని టాగ్ లైన్ తో దీన్ని రూపొందించారు.