Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న అన్న దానికి అంత కోపం ఎందుకు గ‌వ‌ర్న‌ర్ సాబ్‌

By:  Tupaki Desk   |   8 July 2019 12:01 PM GMT
పెద్దాయ‌న అన్న దానికి అంత కోపం ఎందుకు గ‌వ‌ర్న‌ర్ సాబ్‌
X
రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉండేవారు ఆచితూచి మాట్లాడుతుంటారు. త‌మ చుట్టూ జ‌రిగే ప‌లు అంశాల‌కు సంబంధించి ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడ‌కూడ‌ద‌న్న విష‌యంపై వారు విచ‌క్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రిస్తూ.. తామున్న ప‌ద‌వుల వ‌న్నె త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటారు. మ‌రి.. ఏమైందో ఏమో కానీ ఇటీవ‌ల కాలంలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న అస‌హ‌నం.. ఒక‌రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ లో క‌నిపించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌.. ప్ర‌ముఖ ఆర్ధిక‌వేత్త అమ‌ర్త్య‌సేన్ ఇటీవ‌ల ఒక స‌ద‌స్సులో పాల్గొన‌టం.. ఆ సంద‌ర్భంగా ఆయ‌న.. బెంగాల్ లో జై శ్రీ‌రామ్ అనే నినాదాన్ని నేనెప్పుడు విన‌లేదు. ఇక్క‌డి సంస్కృతిలో అది భాగం కాదు. అమాయ‌కుల మీద దాడులు చేయ‌టానికి ఆ ప‌దాన్ని వాడుతున్న‌రంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగింది. ఒక నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత చేసిన ఈ వ్యాఖ్య‌లు అధికార‌ప‌క్ష నేత‌ల్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ఇదిలా ఉంటే.. అమ‌ర్త్య సేన్ వ్యాఖ్య‌ల‌కు బీజేపీ నేత‌లు రియాక్ట్ కావ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకు భిన్నంగా మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ త‌తాగ‌త రాయ్ రియాక్ట్ కావటం మ‌రో సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయ అంశాలు.. వివాదాస్ప‌ద అంశాల‌తో పాటు.. సంచ‌ల‌న అంశాల మీద గ‌వ‌ర్న‌ర్ స్థానంలో ఉన్న వారు సాధార‌ణంగా రియాక్ట్ కారు. అందుకు భిన్నంగా మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ మాత్రం అమ‌ర్త్య‌సేన్ ను ఉద్దేశించి.. ఆయ‌న ప‌నేంటో ఆయ‌న చూసుకుంటే మంచిదంటూ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

బెంగాల్ లో మేం జైశ్రీ‌రామ్ అన‌కూడ‌దా? దెయ్యాల‌కు భ‌య‌ప‌డే సంద‌ర్భంగా మ‌నం జైశ్రీ‌రాం అనే క‌దా అనేది. అమ‌ర్త్య‌సేన్ నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్న‌ది ఆర్థిక‌శాస్త్రంలో. అందులోనే ఆయ‌న నిమ‌గ్న‌మైతే మంచిద‌ని గ‌వ‌ర్న‌ర్ స్థానంలో ఉన్న త‌తాగ‌త రాయ్ మండిప‌డ్డారు. ఒక గ‌వ‌ర్న‌ర్ స్థానంలో ఉన్న వ్య‌క్తి ఇలా స్పందించ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.