Begin typing your search above and press return to search.

రాజరికంలోకి వచ్చాక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..మేఘన్

By:  Tupaki Desk   |   8 March 2021 9:12 AM GMT
రాజరికంలోకి వచ్చాక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..మేఘన్
X
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. సెలబ్రటీ మొదలు సామాన్యుల వరకు ఎవరైనా సరే.. మైకు పట్టుకుంటే చాలు ప్రశ్నలు వేసేస్తుంటారు. కానీ.. ఇంటర్వ్యూ చేయటం కూడా ఒక కళే. గుండె లోతుల్ని తడమాలి. ఏం చెప్పొద్దని డిసైడ్ అయినోళ్ల చేత చెప్పించాలి. ఇంటర్వ్యూ చూస్తుంటే కదిలిపోయేలా చేయాలి. ఇలాంటి టాలెంట్ అందరికి సాధ్యం కాదు. కానీ.. ప్రపంచ మీడియాలో ఓఫ్రా విన్ప్రే భిన్నంగా. సెలబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేసే విధానం.. ఆ సందర్భంగా వారు వెల్లడించే అంశాలు పెను సంచలనంగా మారుతుంటాయి.

మీడియాకు దూరంగా.. ఆ మాటకు వస్తే రాజరికం నుంచే బయటకు వెళ్లిపోయిన ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ దంపతులు తొలిసారి ఒక జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వటమే సంచలనం. అందులో మనసులోని వేదనను.. గుండెల్లో దాచుకున్న బాధను బయటకు కక్కేశారు. తాజాగా వారి ఇంటర్వ్యూ పెను సంచలనంగా మారింది. రాజరికం అంటే పూలపాన్పు అనుకునే వారందరికి.. అందులోని కష్టాల్ని ఈ దంపతులు చెప్పుకొచ్చిన తీరు చూసినప్పుడు.. సామాన్యులుగా మన బతుకులే ఎంతో సంతోషంగా సాగుతున్న భావన కలుగక మానదు.

ఇంతకీ ఇంటర్వ్యూలో ఆ దంపతులు ఏం చెప్పారన్న విషయానికి వెళితే..హ్యారీ కంటే కూడా మేఘన్ చెప్పే అంశాలే అందరికి సర్ ప్రైజింగ్ గా మారాయి. ఇంతకూ ఆమె చెప్పిందన్నది ఆమె మాటల్లోనే చూస్తే..

- హ్యారీని పెళ్లి చేసుకోవటానికి ముందు రాచరికం గురించి ఏ మాత్రం తెలీదు. మహరాణి ముందు ఎలా ఉండాలన్నది కూడా అవగాహన లేదు. హ్యారీతో పెళ్లి తర్వాత ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.

- ప్యాలెస్ లోకి వచ్చాక ఇలా ఉండాలి? అలా ఉండాలి? ఇలానే చేయాలంటూ పలు ఆంక్షలు ఉండేవి. దీంతో ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపించేది. నెలల తరబడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాల్సి వచ్చేది.

- అలా ఉన్నప్పుడు చీకట్లో ఉన్నట్లు అనిపించేది. మానసికంగా ఎంతో వేదనను అనుభవించేదాన్ని.. రాజ కుటుంబంలో ఏ ఒక్కరు సాయం చేయలేదు.

- ఇది సరిపోదన్నట్లు అసత్య ఆరోపణలు చేశారు. నిందలు మోపేవారు. ఇదంతా చూసినప్పుడు వేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. రాజకుటుంబంలో నాకు రక్షణ ఉండదని అర్థమైంది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి కుటుంబంలో చర్చ జరిగింది. నేను నల్లగా ఉంటాను కాబట్టి.. పుట్టబోయే బిడ్డ నల్లగా ఉంటాడని ఆందోళన చెందేవారు.

- మా బిడ్డకు భద్రత ఉండదని.. టైటిల్ కూడా రాదని మాట్లాడుకున్నారు. (ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు) పెళ్లి రోజున ఫ్లవర్ గర్ల్ దుస్తలు విషయంలో కేట్ కాస్త నిరాశకు గురయ్యారు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా. ఏడ్చాను కూడా. ఆ తర్వాత కేట్ సారీ చెప్పటంతో సమస్య ముగిసింది.

- బయట మాత్రం నా వల్లే గొడవ జరిగిందని ప్రచారం జరిగింది. మా పెళ్లి 2018 మే 19న అధికారికంగా జరిగినా.. అంతకు మూడు రోజుల ముందు నుంచే ప్రైవేటుగా రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. మా కోసం మేం ఆ రోజున వేడుక చేసుకున్నాం.