Begin typing your search above and press return to search.

కొరియాల వ‌లే..భార‌త్‌-పాక్ క‌ల‌వాలి

By:  Tupaki Desk   |   3 Jun 2018 11:30 PM GMT
కొరియాల వ‌లే..భార‌త్‌-పాక్ క‌ల‌వాలి
X
ఈ ఏడాది ఏప్రిల్ 27 కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఉత్తర కొరియా - దక్షిణ కొరియాల మధ్య నెలకొన్న 65 ఏండ్ల ఉద్రిక్తత పరిస్థితులకు తెరపడింది. కొరియన్ యుద్ధానికి తెరదించుతూ ఆ తేదీన ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో 1950-53ల మధ్య కొరియన్ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రారంభమైన యుద్ధం కొనసాగుతూనే వస్తుంది. అయితే ఇటీవ‌లి కాలంలో మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో శాంతి స్థాపనకు ఇరు దేశాల నేతలు పన్ముంజోమ్ డిక్లరేషన్‌ పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం సందర్భంగా ఇరువురు నేతలు స్పందిస్తూ.. ఇకపై కొరియన్ ద్వీపకల్పంపై ఎటువంటి యుద్ధం ఉండబోదని.. శాంతి శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రజల పునరేకీకరణకు ఇకపై పాటుపడనున్నట్లు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. మనందరి కోసం ఇకపై ఐక్యంగా జీవించనున్నట్లు చెప్పారు. అణునిరాయుధీకరణకు పాటుపడనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తెలిపారు.

ఈ ప‌రిణామం జ‌రిగిన దాదాపు నెల‌న్న‌ర త‌ర్వాత జమ్ముకశ్మీర్ సీఎం మొహబూబా ముఫ్తీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఇండియా - పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాలకు ఫుల్‌ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. 65 ఏళ్లకు పైగా వైరాన్ని పక్కనపెట్టి కొరియాలు చేతులు కలిపాయని - ఇండియా-పాకిస్థాన్ ఎందుకు ఆ పని చేయకూడదని ఆమె ప్రశ్నించారు. శ్రీనగర్‌ లో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. మనం స్నేహితులను మార్చవచ్చుగానీ పొరుగువాళ్లను కాదు అని వాజ్‌ పేయి అన్న మాటలను మొహబూబా గుర్తుచేశారు. ``మా కొలీగ్ మెహబూబ్ బేగ్ చెప్పినట్లు ప్రజల కోసం 70 ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి ఉత్తర - దక్షిణ కొరియాలు స్నేహితులయ్యారు. కానీ ఇక్కడ మాత్రం మన సరిహద్దుల్లో ఇంకా కాల్పుల మోత మోగుతూనే ఉంది. రెండు వైపుల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దేశాలు దగ్గరయ్యే వరకు ఈ పరిస్థితిలో మార్పు రాదు`` అని ముఫ్తీ అన్నారు. జమ్ముకశ్మీర్ పరిస్థితి చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుస్తుందని - అందుకే తాము చర్చలు కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య సమావేశం జరిగినా కూడా రక్తపాతం ఆగకపోవడం దురదృష్టకరమని మెహబూబా వ్యాఖ్యానించారు.

కాగా, బీజేపీతో పొత్తు ద్వారా సంకీర్ణ స‌ర్కారుకు నాయ‌క‌త్వం వహిస్తున్న ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వం పాక్‌ తో చ‌ర్చ‌ల‌కు నో అంటున్న స‌మ‌యంలో మ‌హ‌బూబా వ్యాఖ్య‌లు కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త‌కు కేంద్రంగా నిలిచిన రాష్ట్రం ముఖ్య‌మంత్రి పెట్టిన ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఎలాంటి స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.