Begin typing your search above and press return to search.

ఉగ్రవాదుల్ని చంపేస్తూ కేంద్రం పండగ చేస్తుందని ఆ మాజీ సీఎం వేదన విన్నారా?

By:  Tupaki Desk   |   29 Aug 2021 8:31 AM GMT
ఉగ్రవాదుల్ని చంపేస్తూ కేంద్రం పండగ చేస్తుందని ఆ మాజీ సీఎం వేదన విన్నారా?
X
నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. తమ స్థాయికి ఏ మాత్రం సరిపోని మాటలు మాట్లాడేందుకు కొందరు రాజకీయ నేతలు తెగబడుతున్న వైనం చూస్తే షాక్ తినాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. రాజకీయ ప్రయోజనం కోసమే కావటం విషాదంగా చెప్పాలి. చేసే మంచి పనిని చెడుగా ముద్ర వేయటానికి ఆమె సాహసిస్తున్న తీరు చూస్తే.. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల్ని సైతం పణంగా పెట్టేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఉగ్రవాదుల్ని చంపకుండా ముద్దులు పెట్టుకొని.. వారికి విందు భోజనాలు పెట్టి.. వారికి కావాల్సినంత మద్యాన్ని అందిస్తూ.. వారు కోరుకున్న ప్రాంతాన్ని వారికి ఇచ్చేయాలా? విన్నంతనే ఒళ్లు మండేలా ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ప్రతిరోజూ ఉగ్రవాదులను చంపేస్తూ కేంద్రం పండగ చేసుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ యువకులందరిపైనా కేంద్రం ఒక రకమైన ముద్ర వేస్తోందన్నారు. అందరూ హింసకు పాల్పడే దయ్యాల్లాగా కేంద్రం చిత్రీకరిస్తోందని.. వారి సమావేశాల్ని అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. 'కశ్మీర్ యువకులు రాజకీయాల్లోకి రాకుండా కేంద్రం అడ్డుకుంటోంది. యువత రాజకీయాల్లోకి రావటం కేంద్రానికి నచ్చటం లేదు. ప్రతి రోజు జరిగే ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులు చనిపోతున్నారు. ఇలా కేంద్రం పండగ చేసుకుంటోంది.అయితే మాకు మాత్రం హింసపై ఏ మాత్రం విశ్వాసం లేదు. శాంతితో కూడిన రాజకీయాల కోసం మేం తాపత్రయపడుతున్నాం. అందుకు తగ్గట్లుగానే మా పోరాటాలు ఉంటున్నాయి. హింసపై మాకు విశ్వాసం లేదు' అని వ్యాఖ్యానించారు.

హింసపై విశ్వాసం లేదని చెప్పినప్పుడు.. హింస.. మానత్వం అన్నది లేకుండా వ్యవహరించే ఉగ్రవాదుల్ని ఎందుకు వెనకేసుకు వస్తున్నట్లు? ఉగ్రవాదులకు అవకాశం ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయం తాజాగా అఫ్గాన్ పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది కదా? ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఉగ్రవాదుల విషయంలో కఠినంగా కాకుండా.. హింస వద్దంటూ శాంతి సుద్దులు చెప్పటం ఏమిటి? ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేయాలి? శాంతిగానే ఉండాలనటం తప్పు కాదు. కానీ.. ఆ మాటలు ఎవరికి చెప్పాలి? తీవ్రవాదులు.. ఉగ్రవాదుల్ని తుపాకీ వదిలేసి.. ప్రజాజీవితంలోకి రమ్మని చెప్పే ధైర్యం మొహబూబాకు ఉందా?