Begin typing your search above and press return to search.

నిమ్స్ లో ఎంఈఐల్ కాన్సర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు

By:  Tupaki Desk   |   13 Sep 2018 9:49 AM GMT
నిమ్స్ లో ఎంఈఐల్  కాన్సర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు
X
హైదరాబాద్: సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ (నిమ్స్)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అంకాలజీ భవనాన్ని మంత్రులు కె. తారకరామారావు - సి. లక్ష్మారెడ్డి ప్రారాంభించారు. ఈ భవనం పూర్తి అధునాతన వైద్య సదుపాయాలతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు మద్దతుగా ఎంఈఐఎల్ అధునాతన సౌకర్యాలతో క్యాన్సర్ వార్డును నిర్మించడం కొనియాడదగినదని వారు పేర్కొన్నారు. మంత్రులు మొత్తం అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ పిపిరెడ్డి - ఎండీ పివి కృష్ణారెడ్డి దగ్గరుండి అన్ని విభాగాలను మంత్రులకు చూపించారు. ఈ సందర్భంగా ఎండి పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడేళ్ళపాటు వార్డు నిర్వహణ వ్యయాన్ని ఎంఈఐఎల్ సంస్థ భరిస్తుందని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అదే విధంగా క్రింది అంతస్థులోని క్యాన్సర్ వార్డును ఆధునీకరించేందుకు ఎండి పివి. కృష్ణారెడ్డి ముందుకు రావడం పట్ల సంస్థ వితరణను మంత్రులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఐఎల్ ప్రతినిధులు పివి.సుబ్బారెడ్డి - ప్రేమ్ కుమార్ పాండే - అఖిల్ రెడ్డి - ఎన్.తిరుపతిరావు - సీహెచ్ సుబ్బయ్య - కె. గోవర్ధన్ రెడ్డి - ఎన్వి.రావు - అశోక్ రెడ్డి - గోవింద్ - ప్రవీణ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరిభాషలో క్యాన్సర్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంకాలజీ అంటారు. భారతదేశంలో క్యాన్సర్ తీవ్రత నానాటికీ పెరుగుతున్నది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 మిలియన్లు కాగా - ప్రతి ఏటా ఏడు లక్షల మంది కొత్త రోగులు నమోదవుతున్నారు. క్యాన్సర్ వల్ల ఏటా దాదాపుగా 5.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 30 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు వారే 71 శాతం ఉంటున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రతి ఏటా 50 శాతం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలో ముఖ్యంగా నోటి - ఛాతి మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల తీవ్రత అధికంగా ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహించిన ఒక సర్వేలో తెలంగాణలోని 12 జిల్లాల్లోనే దాదాపుగా 9,164 క్యాన్సర్ కేసులు నమోదైనట్టు వెల్లడైంది. రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ అంకాలజీ భవనాన్ని నిర్మించేందుకు సంకల్పించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని రోగుల కోసం నిమ్స్ లో కార్పొరేట్ తరహా అత్యాధునిక సౌకర్యాలతో అంకాలజీ భవనాన్ని నిర్మించింది.

ఎంఈఐఎల్ గతంలోనూ రోగులు - వారి వెంట వచ్చే అంటెండెంట్ల సహాయార్థం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. భోజనామృతం అనే పేరుతో హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో రోగులు వెంటవచ్చే అంటెండెంట్లకు మధ్యాహ్నం ఉచితంగా భోజనాన్ని అందించింది. ఈ పథకానికి అయిన మొత్తం ఖర్చును మేఘా ఇంజనీరింగ్ భరించింది. వారానికి 18 వేల మందికి మధ్యాహ్నం పూట భోజనాన్ని అందించే కార్యక్రమం ఒక మహా యజ్ఞంలా కొనసాగింది. అంతేకాదు క్యాన్సర్ వ్యాధి గ్రస్థుల కోసం కూడా గతంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించింది ఎంఈఐఎల్. హైదరాబాద్ లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ బాధిత చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు మరియు వారికి క్యాన్సర్ మహమ్మారితో పోరాడే ఆత్మస్థైర్యాన్ని అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. క్యాన్సర్ బారిన పడిన చిన్నారులకు ఉచితంగా డ్రాయింగ్ బుక్స్ - కలర్ పెన్సిళ్లను అందించడంతోపాటు వారికి - వారి వెంట వచ్చిన అంటెండెంట్లకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

దాదాపు రూ.10 కోట్లు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిమ్స్ లో 18,000 చదరపు అడుగులు స్థలంలో నూతన భవనాన్ని నిర్మించింది మేఘా. ఈ భవన నిర్మాణాన్ని జూన్ 2017లో ప్రారంభించగా - కేవలం ఏడాది కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు క్యాన్సర్ బాధితులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించింది. పురుషుల వార్డుతో పాటు క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు మహిళలు ఉండటంతో వారికోసం ప్రత్యేకంగా మహిళల వార్డును - పిల్లల్లో సైతం క్యాన్సర్ వ్యాపిస్తుండటంతో వారికోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డు - రక్త క్యాన్సర్ బాధితులకు ప్రత్యేకంగా లుకేమియా వార్డును నిర్మించింది ఎంఈఐఎల్. రోగులకు అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేసిన 50 పడకలను ఈ వార్డుల్లో ఏర్పాటు చేశారు. ఐసీయూలో 5 బెడ్లు - పురుషుల వార్డులో 12 బెడ్లు - మహిళ వార్డులో 10 బెడ్లు - చిన్నపిల్లల వార్డులో 11 బెడ్లు - లుకేమియా వార్డులో 12 బెడ్లను ఏర్పాటు చేసింది. ప్రతి బెడ్ కు ప్రత్యేకంగా నాలుగువైపులా కర్టెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వార్డు వద్ద రోగులకు నిరంతరం సహాయం అందించేందుకు నర్సు కోసం ప్రత్యేకంగా నర్స్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు చికిత్సను అందించేందుకు ఉపయోగించే ఆంకాలజికల్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను కూడా ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. క్రిటికల్ కండీషన్ లో ఉన్న క్యాన్సర్ రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉండటం - సమయానికి తగిన మందులు అందించడం - అస్థిరంగా ఉండే రోగుల బ్లడ్ ప్రెషర్ ని నియంత్రించేందుకు ఈ ఐసీయూను వాడుతారు. క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాధితుల శరీరం - ముఖ్యంగా చర్మం చాలా సున్నితంగా మారుతుంది. వారికి ఎండను - వేడిని తట్టుకునే శక్తి ఉండదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎంఈఐఎల్ అంకాలజీ భవనంలోని అన్ని వార్డులకు సెంట్రల్ ఏసీ సదుపాయాన్ని కల్పించింది. ఎల్ ఈడీ లైట్ లతో సీలింగ్ ను ఏర్పాటు చేయడంతోపాటు ముందుభాగంలో రిసెప్షన్ - రోజువారీ ఔట్ పేషెంట్ ను చూసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవలు - డాక్టర్ల పర్యవేక్షణ అవసరమయ్యే రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెడ్ లవద్ద మందు - ఇతర సామగ్రి పెట్టుకునేందుకు టేబుల్ - రోగి తో వెంట వచ్చిన అటెండెంట్ కూర్చునేందుకు కుర్చీ - సెలైన్ స్టాండ్ ను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు అనుకూలంగా ఉండే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాష్ రూంలను వార్డు వారీగా ఏర్పాటు చేశారు.

ఐసీయూ విభాగంలో ఆక్సిజన్ - వాక్యూమ్ ప్రెషర్ సదుపాయాలను ఎంఈఐఎల్ కల్పించింది. అదేవిధంగా ప్రతి వార్డులోని రెండు పడకల వద్ద కూడా ఆక్సిజన్ - వాక్యూమ్ ప్రెషర్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. అంకాలజీ భవనంలో సీసీ కెమెరాలను - ఎలక్ట్రిక్ రూమ్ - 20 మందిని తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన బెడ్ లిఫ్ట్ ను ఏర్పాటు చేసింది. డాక్టర్లకు సంబంధించి డ్యూటీ డాక్టర్ రూం - ఫ్యాకల్టీ రూం - స్టోర్ రూం - ప్రాసెసింగ్ రూం - స్టాఫ్ రూంను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. గ్యాస్ కు సంబంధించిన సామగ్రిని ఢల్లీ నుంచి తెప్పించగా - మిగతా సామగ్రిని హైదరాబాద్ లో సమకూర్చుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సౌకర్యాలకు దీటుగా ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన నిమ్స్ అంకాలజీ భవనం కాన్సర్ బాధితులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ పిపి రెడ్డి మాట్లాడుతూ ఎంఈఐఎల్ తన సామాజిక సేవా కార్యక్రమాలను ఇదే విధంగా కొనసాగిస్తుందని తెలిపారు. వైద్య - ఆరోగ్య - తాగునీరు - రహదారులు - విద్యా తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలను చేపడుతోందని దీనిని మరింత ముందుకు తీసుకువెళతామని ఆయన మీడియాతో చెప్పారు.