Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ఓట్లు సాధిస్తామంటున్న మీరా కుమార్
By: Tupaki Desk | 3 July 2017 10:16 AM GMTరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించిన మీరాకుమార్ తెలంగాణ అధికార పక్షమైన టీఆర్ ఎస్ పార్టీ ఓట్లను పొందడం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ - ఎంఐఎంలకు మద్దతు కోసం లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో టీఆర్ ఎస్ మద్దతు కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడేందుకు ఫోన్ చేశానని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీంతో సీఎంఓకు సమాచారం ఇచ్చామన్నారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ సభ్యుల ఓట్లు పొందేందుకు మా వ్యూహాలు మాకున్నాయని మీరాకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తమ వ్యూహాలు ఏమిటనేది బయటికి చెప్పబోమని ఆమె అన్నారు.
రాష్ట్రంలోని, దేశంలోని ప్రజా ప్రతినిధులకు చరిత్ర సృష్టించే అరుదైన అవకాశం వచ్చిందని...దీన్ని వినియోగించుకుని.. తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసి చరిత్ర సృష్టించాలని మీరాకుమార్ కోరారు. `తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. నేను స్పీకర్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పడింది. అది ఒక చారిత్రక ఘట్టం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే అప్పటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. నాకు మద్దతు పలకాలని తెలంగాణ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా` అని మీరాకుమార్ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతు ప్రకటించిన17 విపక్షాలకు మీరాకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో విలువలు - పిలాసఫిని - సిద్ధాంతాలను కాపాడుకోవాలిసిన అవసరం ఉందని అన్నారు. సిద్ధాంతాల కోసమే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్నానని, తప్పక విజయం సాధిస్తామన్న విశ్వాసం ఉందని తెలిపారు. నేటికి కూడా దళిత్ వర్సెస్ దళిత్ మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టకరమని మీరాకుమార్ అన్నారు. ప్రజలు ఏమి తినాలో ప్రభుత్వమే చెప్పడం ప్రమాదకరమని మీరాకుమార్ వ్యాఖ్యానించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో సోనియా తర్వాత కీలక పాత్ర వహించిన వ్యక్తి మీరాకుమార్ అని తెలిపారు. లౌకికవాదులు మీరాకుమార్ కు మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు మీరాకుమార్ ఓటు వేయాలని కోరారు. ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికై మంత్రిగా, స్పీకర్‌గా మీరాకుమార్ సేవలు అందించారని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/