Begin typing your search above and press return to search.

జగన్ కి ఆ సీఎంతో పోలిక పెట్టిన వైసీపీ సీనియర్

By:  Tupaki Desk   |   6 Sep 2022 5:30 PM GMT
జగన్ కి ఆ సీఎంతో  పోలిక పెట్టిన వైసీపీ సీనియర్
X
జగన్ అంటే జగనే. ఆయన స్టైల్ డిఫరెంట్. ఆయన వైఎస్సార్ రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చినా వైఎస్సార్ తో కూడా పోల్చడానికి లేదు. తండ్రి వ్యవహార శైలి ఒక ఎత్తు అయితే జగన్ ది మరో ఎత్తు. వైఎస్సార్ భోళాగా ఉంటారని చెబుతారు. తాను అనుకున్నది చేయబోయేది ఏదైనా అందరితో పంచుకుంటారని అంటారు. జగన్ మాత్రం మనసులో మాటను బయటపెట్టడం చాలా కష్టమని ఆయన్ని బాగా దగ్గర ఉండి చూసిన వారు చెప్పుకునే మాట.

ఏది ఏమైనా జగన్ అంటే కేరాఫ్ వైఎస్సార్ అనే అంటారు. ఆ విషయం అలా ఉంటే వైఎస్సార్ రెండు సార్లు కాంగ్రెస్ ని గెలిపించి సీఎం గా ప్రమాణం చేశారు. కానీ టోటల్ గా వైఎస్సార్ తన మొత్తం ముఖ్యమంత్రిత్వం పదవీ కాలం అయిదుంపావు ఏళ్ళు మాత్రమే చేశారు. ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన దాదాపు మూడు దశాబ్దాల పాటు సుదీర్ఘ నిరీక్షణే చేశారు. అంటే ఆయన కీలకమైన పదవి ని అందుకోవడానికే జీవితమంతా అతి పెద్ద రాజకీయ‌ పోరాటం చేశారు అనుకోవాలి.

వైఎస్సార్ సీఎం అయ్యే నాటికి ఆయన వయసు సుమారుగా 55 ఏళ్ళు. ఇక జగన్ సీఎం అయ్యేనాటికి ఆయన వయసు సుమారుగా 46 ఏళ్ళు. అంటే తండ్రి కంటే దాదాపుగా పదేళ్ల ముందే సీఎం పీఠం జగన్ పట్టేశారు. అంతే కాదు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పదేళ్ళలోనే సీఎం సీటుని అధిష్టించారు అంటే ఇక్కడ కూడా ఆయన అదృష్టవంతుడే అని చెప్పాలి. ఇక జగన్ చిన్న వయసులోనే ఈ కీలకమైన పదవిని చేపట్టారు కాబట్టి ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ‌ భవిష్యత్తు ఉందని అంతా ఊహిస్తారు. ఇక వైఎస్సార్ పార్టీ వారు అయితే అంతకు రెట్టింపు ఊహిస్తారు.

జగన్ అయితే తాను స్వయంగా చెప్పుకున్న మాట ఒకటి ఉంది. ముప్పయ్యేళ్ళ పాటు తాను సీఎం గా ఉంటాని అని ఆయన పాదయాత్ర వేళ జనాల ముందు చెప్పుకునే వారు. ఇపుడు ఆయన తొలి టెర్మ్ లో మెజారిటీ కాలం గడచిపోయింది. 2024లో వైసీపీ రెండవమారు అధికారంలోకి వస్తుందా అంటే వస్తుంది అన్న వారు ఉన్నారు. రాదని తేల్చేసే వారూ ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీలో రాజకీయ భీష్మాచార్యుడు లాంటి ఒక కీలక నేత ఉన్నారు.

ఆయన అందరి కంటే ముందే జగన్ లోని నాయకత్వ లక్షణాలు గమనించి ఆయన వైపు వచ్చాను అని చెప్పుకుంటారు. ఆయనే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన జగన్ సీఎం అవుతాను అని నాడే ఊహించాను అని సంగం బ్యారేజి ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో చెప్పుకొచార్. జగన్ తండ్రి వైఎస్సార్ మాదిరిగానే గొప్ప లీడర్ అని కితాబు ఇచ్చారు. ఇక పోలవరం సహా అన్ని రకాలైన ప్రాజెక్టులు పూర్తి చేసే సత్తా జగన్ కే ఉంది అన్నారు.

అంతే కాదు వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు మళ్ళీ వైసీపీ గెలిచి తీరుతుందని కూడా మేకపాటి జోస్యం చెప్పారు. అలాగే పాతికకు పాతికా ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని కూడా మేకపాటి తనదైన సర్వే వినిపించారు. అంతే కాదు, 2024లో కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణం వస్తుందని, దాంతో జగన్ నాయకత్వాన ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి పారిశ్రామికంగా ఏపీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పుకొచ్చారు.

ఇక జగన్ ఒక్క 2024లో ఏమిటి,2029, 2034ల ఎన్నికలతో పాటుగా మొత్తం అన్ని ఎన్నికల్లోనూ వరసగా గెలిచి సీఎం గా దశాబ్దాల పాటు నిరంతరం కొనసాగుతారని ఆయన జోస్యం చెప్పారు. పొరుగున ఉన్న ఒడిషా సీఎం మాదిరిగా జగన్ కి ఎదురు ఉండదని మేకపాటి అంటున్నారు. ఇప్పటికే అయిదు దఫాలుగా సీఎం గా నవీన్ పట్నాయక్ కొనసాగుతున్నారు. మరి ఏపీ సీఎం జగన్ కూడా ఒడిషా సీఎం మాదిరిగా సుదీర్ఘ కాలం సీఎం గా ఉంటారా. ఏపీలోని పాత రికార్డులు తిరగరాస్తారా. ఏమో చూడాలి. ఏది ఏమైనా సంగం బ్యారేజ్ ప్రారంభం సందర్భంగా మేకపాటి వారి స్పీచ్ జగన్ సహా అందరికీ మహదానందం కలిగించింది అనడంలో సందేహం లేదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.