Begin typing your search above and press return to search.

వైసీపీ క్లారిటీ..మాది ఒంట‌రి పోరే

By:  Tupaki Desk   |   26 March 2018 6:13 PM GMT
వైసీపీ క్లారిటీ..మాది ఒంట‌రి పోరే
X
2019 ఎన్నిక‌ల్లో బీజేపీ - వైసీపీతో క‌లిసి సాగే ఆలోచ‌న‌తో ఉంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌ది ఒంట‌రిపోరేన‌ని ఆ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. లోక్‌ సభ - రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన విషయాలపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల గ్రామం ప్రజా సంకల్ప క్యాంపు కార్యాలయంలో వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. అనంత‌రం పార్లీ ఫ్లోర్ లీడ‌ర్ మేక‌పాటి మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో క‌లిసి పోటీ చేసే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

తాము బీజేపీతో క‌లిసి పోరాటం చేస్తామ‌నే విష‌యం కొంద‌రి ప్ర‌చార‌మేన‌ని ఎంపీ మేక‌పాటి తెలిపారు. లోపాయికారి అవ‌గాహ‌న లేద‌నే లేద‌ని..ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. బీజేపీతో కలిసే అవకాశం లేదని, అయితే వామపక్షాలు వారు ఎవరైనా తమ షరతులకు లోబడి కలిసి పనిచేస్తామంటే అప్పుడు ఆలోచించవచ్చని మేకపాటి అన్నారు. ప్ర‌స్తుతం టీడీపీ బీజేపీకి దూర‌మ‌యింద‌ని పేర్కొంటూ..ఒక‌వేళ బాబు నిర్ణ‌యం మారితే రాబోయే కాలంలో ఆయ‌న మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌కావ‌చ్చున‌ని మేక‌పాటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తాము రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌ని పేర్కొంటూ టీడీపీ ఎంపీలతో చంద్ర‌బాబు రాజీనామా చేయిస్తే బాగుంటుందని, అందరం కలిసి రాజీనామాలు చేస్తే స్పష్టమైన సందేశం పంప‌వ‌చ్చ‌ని అన్నారు.

టీడీపీకి మెజార్టీ ఎంపీలున్నా హోదా సాధనలో విఫలమైందని ఎంపీ మేక‌పాటి విరుచుకుపడ్డారు. హోదా విషయంలో రాజీపడేది లేదని - ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పారు. పార్లమెంట్‌ వాయిదా పడిన వెంటనే స్పీకర్‌ ఫార్మాట్‌ లో రాజీనామాలు చేయాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తాము అందుకు సిద్ధ‌మ‌ని మేక‌పాటి తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు స్పీకర్‌ ఫార్మాట్‌ లో రాజీనామాలు చేస్తామని ఎంపీలు స్పష్టం చేశారు.