Begin typing your search above and press return to search.

ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్

By:  Tupaki Desk   |   3 Jun 2022 3:26 AM GMT
ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్
X
మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలసిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఆయన చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. జూన్ 2న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెంట రాగా విక్రమ్ రెడ్డి నెల్లూరులో నామినేషన్ దాఖలు చేశారు.

అంతకుముందు ఇంటిలో తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి.. తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మణిమంజరిల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఇంటి నుంచి బయలుదేరాక మార్గమధ్యంలో పలు దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికకు టీడీపీ, జనసేన పార్టీలు దూరంగా ఉండాలని దాదాపు ఇప్పటికే నిర్ణయించాయి. బీజేపీ మాత్రం పోటీ చేయడానికి మొగ్గుచూపుతోంది. ఈ మేరకు తాము పోటీలో ఉంటామని ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ముగ్గురు సభ్యుల పేర్లను ఫైనల్ చేసి బీజేపీ అధిష్టానానికి పంపింది. వీరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజివేముల రవీంద్రారెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ తరపున దాదాపు రవీంద్రారెడ్డే పోటీ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు అధికార వైఎస్సార్సీపీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి పోటీ చేస్తారని మొదట వార్తలు వచ్చినా ఆ కుటుంబం విక్రమ్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఇప్పటికే విక్రమ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిపోతున్నారు.

మరోవైపు టీడీపీ, జనసేన తమ అభ్యర్థులు పోటీలో ఉండరని ప్రకటించిన నేపథ్యంలో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని అని చెప్పవచ్చు. మెజారిటీ ఎంత వస్తుందనేది కీలకం.

అయితే మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లక్షకు పైగా భారీ మెజారిటీ సాధించి తమ సత్తా చాటాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. తద్వారా మేకపాటి గౌతమ్ రెడ్డికి సరైన నివాళి ఇస్తామని చెబుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజల మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని చెప్పుకోవడానికి మొగ్గుచూపుతోంది. ఇప్పటికే ఈ దిశగా వైఎస్సార్సీపీ అధిష్టానం నెల్లూరు జిల్లా పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీ గెలుపొందితే తమపై వ్యతిరేతక ఏమాత్రం లేదని చెప్పుకుంటుందని అంటున్నారు. అందుకే భారీ విజయం సాధించామని.. ఈ విజయం వచ్చే ఎన్నికలకు సంకేతమని ఆ పార్టీ చెప్పుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు.

మరోవైపు మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా బీజేపీ పోటీ చేసినా తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. టీడీపీ, జనసేన పోటీ చేయబోమని తన అన్నపై ఆ రెండు పార్టీలు గౌరవం ప్రకటించాయని విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు.

కాగా, ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మే 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 9ని చివరి తేదీగా పేర్కొన్నారు. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను జూన్ 28లోగా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.