Begin typing your search above and press return to search.

మేకతోటి రాజీనామా...కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

By:  Tupaki Desk   |   10 April 2022 5:18 PM GMT
మేకతోటి రాజీనామా...కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
X
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గరం గరం గా మారుతోంది. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అయితే తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోయారు. ఆమె తనకు మలివిడత క్యాబినెట్ లో బెర్త్ దక్కనందుకు నిరసన తెలియచేస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు.

స్పీకర్ ఫార్మెట్ లో ఆమె రాజీనామా చేసేశారు. తనను సముదాయించడానికి ఇంటికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందచేశారు. స్పీకర్ ఫార్మెట్ లో తన రాజీనామాను ఆమె మోపిదేవికి ఇవ్వడం సంచలనం సృష్టించింది.

ఆమె వైఎస్సార్ ఫ్యామిలీకి బాగా సన్నిహితురాలు. 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఆమె గెలిచారు. ఆ తరువాత జగన్ పార్టీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అలాంటి మేకతోటికి తొలి విడతలో ఏకంగా హోమ్ మంత్రి వంటి కీలకమైన పదవిని జగన్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నాడే రెండున్నరేళ్ల తరువాత మంత్రి పదవులు పూర్తిగా మార్చేస్తామని చెప్పామని, అయినా ఆమె ఇపుడు రాజీనామా చేయడం, నిరసన తెలియచేయడం పట్ల వైసీపీ అగ్ర నాయకత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక ఆమెను బుజ్జగించే చర్యలకు పార్టీ పెద్దలు దిగుతున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డిని పంపించడం ద్వారా ఆమెకు భరోసా ఇచ్చి రాజీనామా వెనక్కి తీసుకునేలా చూడాలని భావిస్తున్నారు.

అయితే మేకతోటి సుచరిత మాత్రం రాజీనామా నిర్ణయం మారదు అని చెబుతున్నారు. దీంతో వైసీపీ వర్గాలు షాక్ తింటున్నాయి. మరో వైపు చూస్తే సుచరిత అనుచరులు, ముఖ్య నాయకులు సైతం మోపిదేవిని అడ్డుకున్నారు. తమ నాయకురాలికి అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించడం జరిగింది. మొత్తానికి ప్రత్తిపాడు ఉద్రిక్తతలతో వేడెక్కింది.