Begin typing your search above and press return to search.

అభిశంసనలో ట్రంప్ సుడి తిరిగిందా?

By:  Tupaki Desk   |   5 Dec 2019 9:18 AM GMT
అభిశంసనలో ట్రంప్ సుడి తిరిగిందా?
X
అందుకే అంటారు ఉత్సాహం మంచిదే కానీ అత్యుత్సాహం పనికి రాదని. ప్రత్యర్థి బలవంతుడు.. శక్తివంతుడైన వేళ.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలే కానీ ఇరుకున పెట్టామన్న ఉత్సాహం మోతాదు మించితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తాజాగా డెమొక్రాట్లకు అర్థమయ్యేలా చేశారు ట్రంప్ సతీమణి మెలానియా. ట్రంప్ పై అభిశంసన సందర్భంలో తొలిరోజు విచారణ సందర్భంగా పరిధి దాటిన న్యాయ నిపుణురాలు తప్పులో కాలేయటమే కాదు.. ట్రంప్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై అభిశంసనకు సంబంధించిన విచారణను కాంగ్రెస్ చేపట్టింది. తొలిరోజు విచారణలో భాగంగా డెమొక్రాట్ల తరఫున వాదన వినిపించేందుకు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పమేలా కర్లన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నోటి వెంట అభ్యంతరకర వ్యాఖ్యలు వచ్చాయి. కాంగ్రెస్ సభ్యురాలు షీలా జాక్ సన్ లీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్ తన కుమారుడి పేరు ముందు రాజు అన్న అర్థం వచ్చేలా బారన్ పేరు పెట్టుకున్నారని.. రాజును మాత్రం చేయలేరని మాట తూలేశారు.

ఇలాంటి తప్పు కోసమే ఎదురుచూస్తున్న ట్రంప్ వర్గం వెంటనే పావులు కదిపారు. ట్రంప్ సతీమణి రంగంలోకి దిగి కర్లస్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. రాజకీయ వ్యవహారాల్లోకి తన పదమూడేళ్ల కుమారుడ్ని లాగటం ఏమిటంటూ మండిపడ్డారు. గురి పెట్టి వదిలిన బాణంలా మెలినియా నోటి నుంచి వ్యాఖ్యలు ఆమె వాదనను బలపర్చటమే కాదు.. స్టాన్ ఫోర్డు ప్రొఫెసర్ తీరును పలువురు తప్పు పట్టారు.

తన వ్యాఖ్యలు గురి తప్పాయని గుర్తించిన ఆమె సర్దుకొని.. క్షమాపణలు చెప్పేశారు. తాను పొరపాటున మాట్లాడినట్లుగా అంగీకరించారు. దీంతో అభిశంసన వ్యవహారం తొలి రోజు విచారణ ట్రంప్ కు సానుకూలంగా మారితే.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం దుర్దినంగా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.