Begin typing your search above and press return to search.

ట్రంప్ లాగే కొత్త ర‌చ్చ సృష్టించిన మెలానియా

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:30 AM GMT
ట్రంప్ లాగే కొత్త ర‌చ్చ సృష్టించిన మెలానియా
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్ర‌స్తావించాలంటే...వివాదాస్ప‌ద మ‌నిషి అనేది తెలిసిన సంగ‌తే. అయితే ట్రంప్ మాత్ర‌మే కాదు ఆయ‌న ఫ్యామిలీ ఫ్యామిలీ తేడాగా ఉంద‌ని అంటున్నారు. తాజాగా అధ్య‌క్షుడు ట్రంప్ వ‌లే ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కూడా వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె టెక్సాస్ సరిహద్దులో ఉన్న శరణార్థ చిన్నారులను కలవడానికి వెళ్లిన సమయంలో వేసుకున్న జాకెట్‌ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ జాకెట్ వెనుక ఓ వివాదాస్పద వ్యాఖ్య ఉండటమే దీనికి కారణం. ఐ రియల్లీ డోన్ట్ కేర్.. డూ యూ? అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఇదే ఇప్పుడు ర‌చ్చ‌రచ్చ‌గా మారుతోంది.

ప్రస్తుతం అమెరికా సరిహద్దులో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేస్తుండటంపై పెద్ద దుమారం రేగుతున్న విషయం తెలిసిందే కదా. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. తల్లిదండ్రులను జైళ్లలో వేస్తూ.. పిల్లలను ఇమ్మిగ్రేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఆ పిల్లలను తోడు లేకుండా వచ్చిన మైనర్లుగా చెప్పడం మరింత వివాదాస్పదమైంది. ఇలా ర‌చ్చ‌ర‌చ్చ సాగుతున్న సమయంలో మెలానియా ఈ సందేశం ఉన్న జాకెట్ వేసుకోవడం చర్చనీయాంశమైంది. నిజానికి టెక్సాస్‌ లోని మెక్ అలెన్‌ లో ల్యాండయ్యే వరకు కూడా మెలానియా ఈ జాకెట్ ధరించలేదు. కానీ తిరుగు ప్రయాణంలో ధరించారు. దీనిపై విమర్శలు వస్తున్నాయని తెలిసీ ఆమె కావాలని వేసుకోవడం గమనార్హం. టెక్సాస్ ఇమ్మిగ్రేషన్ సెంటర్‌ కు వెళ్లి అక్కడి పిల్లలను కలిసిన తర్వాత ఆ విషయాన్ని ట్విటర్‌ లో పోస్ట్ చేశారు.

మ‌రోవైపు ట్రంప్ మాత్రం తన భార్యను వెనుకేసుకొచ్చారు. ఫేక్ న్యూస్ మీడియాను ఉద్దేశించే ఆమె ఈ జాకెట్ వేసుకున్నదని, వాళ్లను ఇక ఏమాత్రం విశ్వసించే ప్రసక్తే లేదని ఆమె తెలుసుకున్నారని ట్రంప్ ట్వీట్ చేశారు. మెలానియా ఆ జాకెట్ వేసుకోవడాన్ని తప్పుబడుతున్న మీడియాపై డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ప్ర‌ముఖ మ్యాగజైన్ టైమ్ అయితే ట్రంప్ విధానాన్ని ఎండగడుతూ.. తన కవర్ పేజీపై ఆయనను ఓ విలన్‌లా చిత్రీకరించింది. రెండేళ్ల ఏడుస్తున్న చిన్నారి ఫొటోకు ఎదురుగా ట్రంప్ నిల్చున్న ఫొటోను కవర్‌పేజీగా వేశారు.