Begin typing your search above and press return to search.

లంచం అడిగినందుకు నోట్లు తినిపించారు

By:  Tupaki Desk   |   8 Feb 2017 9:06 AM GMT
లంచం అడిగినందుకు నోట్లు తినిపించారు
X
లంచ‌గొండుల దిమ్మ తిరిగే వార్త‌. ఇంకా చెప్పాలంటే లంచం ఇచ్చేవారి ఆవేద‌న తారాస్థాయికి చేరితే ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో చెప్పే ఉదాహ‌ర‌ణ‌. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో లంచ‌గొండి ప్రభుత్వ అధికారిని బలవంతంగా కరెన్సీ నోట్లు తినిపించారు ఓ ఎన్జీవో కార్యకర్తలు! మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెస్ట్‌ జోన్‌ పన్ను విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్న ధర్మీన్‌ వ్యాస్‌ అవినీతికి పాల్పడుతున్నాడని ప్ర‌చారం సాగుతోంది. ఓ వ్య‌క్తి నుంచి తమ‌కు వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు స్థానిక లోక్‌ రక్షక్‌ సేవా సమితి కార్యకర్తలు 30 మంది రంగంలోకి దిగారు. స‌ద‌రు ప్ర‌భుత్వ అధికారి ఆఫీసుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా మీడియానూ వెంట తీసుకువెళ్లారు. ఆయ‌నకు లంచం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాద‌ని చెప్ప‌డంతో నోట్లకు పచ్చడి పూసి తినాలని వ్యాస్‌ కు చెప్పారు. అతడు ప్రతిఘటించడంతో నోటిని బలవంతంగా తెరిచి నోట్లు కుక్కారు. ఈ దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.

ఇదిలాఉండ‌గా ఈ ప‌రిణామం వివాదాల‌కు దారితీసింది. స‌ద‌రు ప్ర‌భుత్వ అధికారి అయిన వ్యాస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసి లోక్‌ రక్షక్‌ సేవా సమితి అధినేత‌ పృథీభట్‌ ను అరెస్ట్‌ చేశారు. తానే తప్పూ చేయలేదని భట్ ఈ సంద‌ర్భంగా వివ‌రించాడు. అవినీతిని ఎదుర్కోవ‌డంపైనే త‌మ పోరాటమ‌ని తెలిపారు. గతంలో అవితీపరుడైన ఓ మున్సిపల్ అధికారితో మురికినీటిని తాగించామని ఆయ‌నీ సంద‌ర్భంగా షాకింగ్ వార్త వెల్ల‌డించాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/