Begin typing your search above and press return to search.

నిర్భ‌య దోషుల‌కు ఉరి..కేంద్ర‌మంత్రి హ‌ర్షం

By:  Tupaki Desk   |   5 May 2017 1:34 PM GMT
నిర్భ‌య దోషుల‌కు ఉరి..కేంద్ర‌మంత్రి హ‌ర్షం
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భ‌య కేసు దోషుల‌కు విధించిన ఉరి శిక్ష‌ను మార్చ‌డానికి సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఈ కేసులో దోషులైన ముఖేశ్‌ - విన‌య్‌ - ప‌వ‌న్‌ - అక్ష‌య్‌ ల‌కు ఉరే స‌రి అని ఈ సంద‌ర్భంగా సుప్రీం స్ప‌ష్టంచేసింది. ట్రయ‌ల్ కోర్టు విధించిన శిక్ష‌ను స‌మ‌ర్థించింది. బాధితురాలికి అయిన తీవ్ర గాయాలు, దోషులు తీవ్ర నేరానికి పాల్ప‌డినందు వ‌ల్ల ఉరి శిక్ష విధించాల‌న్న కింది కోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తున్నాం అని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీనిని అత్యంత అరుదైన కేసుగా ధ‌ర్మాస‌నంలోని ముగ్గురు న్యాయ‌మూర్తులు అభివ‌ర్ణించారు.

కోర్టు రూమ్‌లో ఉన్న లాయ‌ర్లు, నిర్భ‌య త‌ల్లిదండ్రులు చ‌ప్ప‌ట్ల‌తో ఈ తీర్పును స్వాగ‌తించారు. ఈ కేసు తీవ్ర‌త‌ను చూస్తే ఉరి శిక్ష త‌ప్ప ఏ శిక్ష విధించినా త‌క్కువే అని ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా అన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా - ఆర్. భానుమతి - అశోక్ భూషన్‌ లతో కూడిన ధర్మాసనం మార్చి 27న విచారణను ముగించి తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది.

మ‌రోవైపు నిర్భ‌య కేసులో దోషులైన ముఖేశ్‌ - విన‌య్‌ - ప‌వ‌న్‌ - అక్ష‌య్‌ ల‌కు ఉరే స‌రి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ తీర్పుపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం సంతోషంగా ఉందని మేనకా గాంధీ అన్నారు. చాలా త్వరగా తీర్పు వచ్చిందన్నారు. సుప్రీం తీర్పు ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని నిర్భ‌య తండ్రి కూడా పేర్కొన్నారు. వ్య‌క్తిగ‌తంగా తాను ఉరిశిక్ష‌కు విరుద్ద‌మ‌ని, కానీ హేయ‌మైన నేరానికి క‌ఠిన‌మైన శిక్ష త‌ప్పదు అని సీపీఎం నేత బృందా కార‌త్ అన్నారు. భార‌త దేశంలో న్యాయ‌వ్య‌వ‌స్థ కొంద‌ర్ని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్న‌ద‌ని, అందుకే తాను మ‌ర‌ణ‌శిక్ష‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/