Begin typing your search above and press return to search.

'మెస్సయ్య దయానంద్': 50 మంది ప్రాణాల్ని కాపాడి అలా అనటం అతడికే సాధ్యం

By:  Tupaki Desk   |   19 May 2022 1:51 AM GMT
మెస్సయ్య దయానంద్: 50 మంది ప్రాణాల్ని కాపాడి అలా అనటం అతడికే సాధ్యం
X
పావలా పనికి పాతిక రూపాయిల గొప్పలు చెప్పుకునే వారు ఈ మధ్యన ఎక్కువయ్యారు. అందునా.. సోషల్ మీడియా.. యూట్యూబ్ జమానాలో చేసింది తక్కువైనా.. చెప్పుకునే విషయంలో మాత్రం చెలరేగిపోయే తీరు చాలాచోట్ల కనిపిస్తుంది. అలాంటిది దారుణ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వేళ.. ఏకంగా యాభై మందిని ప్రాణాలతో కాపాడిన వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా.. తనదేం గొప్పతనం కాదని చెప్పే తీరుకు ఫిదా కావాల్సిందే.

అతడి కారణంగా ప్రాణాలు నిలుపుకున్న వారు.. అతన్ని మెస్సయ్యగా కీర్తిస్తుంటే.. తన గొప్పేం లేదనే వినయం చూస్తే ముచ్చట వేయటం ఖాయం. ఒక సామాన్యుడు అసామాన్యుడి మాదిరి వ్యవహరించి.. సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న తీరును అభినందించకుండా ఉండలేం. ఇలాంటి వారి గొప్పల్ని నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఎవరతను? అన్న విషయంలోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. 27 మంది సజీవ దహనం కావటం తెలిసిందే. ఈ విషాద ఘటన వేళ.. ట్రక్కు డ్రైవర్ దయానంద్ అపద్బాంధవుడిలా మారి.. ఏకంగా యాభై మందిని రక్షించిన వైనం తెలిసిందే. ఇదే ప్రమాదంలో 27 మంది సజీవ దహనం కావటం తెలిసిందే. ఒకవేళ ఆ సమయంలో దయానంద్ అక్కడకు వెళ్లకపోయి ఉంటే.. అక్కడ జరిగే విషాదాన్ని ఊహిస్తేనే ఒళ్లు జలదరించక మానదు. అగ్నిప్రమాదం జరిగినవేళ.. అసలేం జరిగింది? తానేం చేశానన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటల్ని విన్న వారంతా ఆయనకు ఫ్యాన్స్ గా మారిపోవటం ఖాయం.తాను చేసిన అత్యుద్భమైన.. సాహసోపేతమైన పనిని ఒక సామాన్యుడు ఎంత సాదాసీదాగా చెప్పుకోవటం చూస్తే.. ఆయన వినయానికి.. మంచినతనానికి వావ్ అనకుండా ఉండలేం.

యాభై మందిని ప్రాణాలతో కాపాడిన ఆయన.. ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ.. "ఆ రోజు పని పూర్తి అయ్యాక నా తమ్ముడు అనిల్ తో కలిసి వెళుతున్నాం. నాలుగో అంతస్తు నుంచి దట్టమైన పొగ కనిపించింది. భయంతో అరుపులు వినిపించాయి. బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిని కాపాడటం కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. అక్కడకు ఎలా అయినా వెళ్లాలని అనుకున్నాం. ట్రాఫిక్ కారణంగా వెళ్లలేని పరిస్థితి. దీంతో డివైడర్ ను విరగ్గొట్టి బిల్డింగ్ వద్దకు చేరుకున్నాం.

అందులో చిక్కుకుపోయిన వారు బయటకు వచ్చే దారి కనిపించట్లేదు. అందుకే బిల్డింగ్ అద్దాల్ని పగలగొట్టా. నాలుగు నుంచి ఆరు బ్యాచ్ లలో యాభై మందిని ప్రాణాలతో కాపాడగలిగాం. మంటలు పెరిగి.. పొగలు బాగా కమ్ముకోవటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. దీంతో లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించటం అసాధ్యమైంది. అందుకే సహాయక చర్యల్ని ఆపేయాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చారు.

దయానంద్ తివారీ చేసిన సాహసానికి ప్రాణాలతో బయటపడిన వారంతా.. అతన్ని మెస్సయ్యగా అభివర్ణిస్తున్నారు. దేవుడే ఆయన్ను పంపారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీనికి ఆయన స్పందన ఏమంటే.. సాటి మనిషిగా సాయం చేయటం తన బాధ్యత అని.. తానేదో అసాధారణమైన పని చేసినట్లుగా అనుకోవట్లేదని చెప్పటం గమనార్హం. "దేవుడు.. నన్ను ఆ సమయంలో అక్కడ ఉంచటం వల్లే నేను సాయం చేశా'' అని తాను చేసిన పనిని చెప్పుకున్న తీరు చూస్తే మాత్రం ముచ్చటేయక మానదు. బిహార్ కు చెందిన దయానంద్.. పాతికేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చి ట్రక్కు డ్రైవర్ గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోని మండ్కా పరిసరాల్లో ఆయన ఉంటున్నారు. దయానంద్ లాంటి వారి తీరు పాలకుల్లో ఉంటే దేశం ఎంతలా బాగుపడుతుందో కదా?