Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాలో ''# Me Too'' వైర‌ల్‌

By:  Tupaki Desk   |   18 Oct 2017 4:55 PM GMT
సోష‌ల్ మీడియాలో # Me Too వైర‌ల్‌
X
ఆఫీసులు - బ‌స్ స్టాప్ లు - రైల్వే స్టేష‌న్లు - పార్కులు వంటి ప్ర‌దేశాల్లో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల గురించి మ‌ననం నిత్యం వింటూనే ఉంటాం. అయితే, చాలామంది ప‌రువు పోతుంద‌నే భ‌యంతోనో - ఇత‌ర‌త్రా కార‌ణాల‌తోనో వాటిని బ‌హిర్గతం చేయ‌డానికి ముందుకు రారు. ఆ బాధ‌ల‌ను త‌మ‌లోనే దిగ‌మింగుకొని ఎవ‌రికీ చెప్పుకోలేక మ‌ద‌న‌ప‌డుతుంటారు. అయితే, తాజాగా సోష‌ల్ మీడియాలో అటువంటి ఘ‌ట‌న‌ల‌ను పంచుకునేందుకు ఒక ఓపెన్ కాల్ ప్రచారంలోకొచ్చింది. మీ జీవితంలో ఎదురైన‌ లైంగిక వేధింపుల గురించి సవివరంగా రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ ''# Me Too'' మీద ప్రపంచవ్యాప్తంగా ఓ ఉద్య‌మం మొద‌లైంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ''# Me Too'' ట్రెండింగ్ లో ఉంది. ఆ హాష్ ట్యాగ్ పేరుతో చాలామంది త‌మ అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ''# Me Too'' వైర‌ల్ గా మారింది.

త‌మపై హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వీ వీన్ స్టీన్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని చాలామంది న‌టీమ‌ణులు - మ‌హిళ‌లు ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హార్వీ వీన్ స్టీన్ కు వ్యతిరేకంగా ''# Me Too''ఉద్యమం అక్టోబర్ 15న మొదలైంది. సోష‌ల్ మీడియాలో న‌టి అలీసా మిలానో ఈ ఉద్య‌మాన్ని ప్రారంభించింది. ఇంత‌వ‌ర‌కు ఎదుర్కొన్న లైంగిక వేధింపులు చాల‌ని, ఇక‌పై వాటిని భ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది. ''ఒక ఫ్రెండ్ గా చెబుతున్నా.. పంటిబిగువున భరించింది చాలు.. ఇకనైనా ఓపెన్ అవండి.. మగాళ్లలోని మురికితనాన్ని ఎండగట్టండి.. మీకెదురైన వేధింపుల్ని ప్రపంచం ముందు పెట్టండి'' అంటూ అలీసా ట్వీట్ చేసింది. ఆమె పిలుపుతో ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌లు త‌మ చేదు అనుభ‌వాల‌ను ''# Me Too''పేరుతో షేర్ చేసుకుంటున్నారు. ''# Me Too'' మీద ఈ పోస్టులన్నింటినీ ప్రపంచం మొత్తం చూడ‌డం ద్వారా మహిళల్లో చైతన్యం నింపాల‌న్న‌ది ఈ ఉద్య‌మం ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని అలీసా చెప్పారు.

భార‌త్ లో ఈ ఉద్యమం బాగా ఊపందుకుంది. ''# Me Too'' ఉద్య‌మంపై రాజ‌కీయ నాయకులు, పోలీసులు కూడా స‌త్వ‌ర‌మే స్పందిస్తున్నారు. ''# Me Too''లో ఫిర్యాదు చేసినా నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కోల్‌క‌తా పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ ఉద్య‌మంపై మ‌ధ్యప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. లైంగిక దాడికి గుర‌వుతున్నామ‌ని చెబుతోన్న వారికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు. యువ‌తులు, మ‌హిళ‌లు త‌మ అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో పోకిరీల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. త‌మ బాగోతాల‌ను అమ్మాయిలు సోష‌ల్ మీడియాలో బయ‌ట పెడ‌తారేమోన‌ని యువ‌కులు వ‌ణికిపోతున్నారు. ఫిర్యాదులు అంద‌డంతో కొంత‌మంది పోకిరీల సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను నిర్వాహ‌కులు బ్లాక్ చేశారు.