Begin typing your search above and press return to search.

హైదరాబాదీయులకు శుభవార్త చెప్పిన మెట్రో రైల్

By:  Tupaki Desk   |   5 Sep 2021 8:30 AM GMT
హైదరాబాదీయులకు శుభవార్త చెప్పిన మెట్రో రైల్
X
గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్. ఏళ్లకు ఏళ్లుగా హైదరాబాదీయులు ఎదురుచూసిన మెట్రో రైల్ రావటం. దశాల వారీగా.. సిటీ మొత్తాన్ని కాకున్నా.. కోర్ సిటీని కొంతమేర కవర్ చేయటం.. రెండో దశకు వడివడిగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్న వేళలో.. కరోనా మహమ్మారి వచ్చి పడింది. మిగిలిన రంగాల మీద ఏ రీతిలో అయితే ప్రభావాన్ని చూపిందో.. అంతకు మించిన దెబ్బే మెట్రో మీద పడింది. మెట్రో రైల్ ప్రాజెక్టుకు దాదాపు రూ.18వేల కోట్లు ఖర్చు చేయటం.. మరో పదివేల కోట్ల వరకు ఖర్చు చేస్తే.. హైదరాబాద్ ప్రజా రవాణా విషయంలో ఎంతో మేలు జరిగే వీలుంది.

మెట్రో రైల్ మీద ఆదాయం ప్రయాణికుల టికెట్ల మీద కంటే కూడా.. షాపుల అద్దెలు.. ప్రకటనల మీదనే ఎక్కువ రావాల్సి ఉంది. అప్పుడప్పుడే టేకాఫ్ కు సిద్ధమవుతున్న కీలకమైన దశలో వరుస లాక్ డౌన్ లు.. కరోనా భయం మెట్రో రైలు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి. దీంతో.. హైదరాబాద్ మెట్రో తీవ్రమైన నష్టాల్లో ఉందన్న వార్తలు తరచూ వస్తున్నాయి. తన వాటాను అమ్మేసుకొని బయటపడదామని.. ఎల్ అండ్ టీ ఆలోచనలో ఉందన్న సమాచారం బయటకు పొక్కింది.

ఇలాంటివేళ.. రెండో దశ మెట్రో మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. జీఎంఆర్ మెట్రో ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు ముందుకు రావటం తెలిసిందే. ఓపక్క మెట్రో విస్తరణకు సంబంధించిన వార్తల జోరు పెరుగుతున్న వేళలోనే.. మెట్రో రైల్ టైమింగ్స్ విషయంలోనూ ఒక అడుగు ముందుకు వేశారు. కరోనా కారణంగా.. ప్రయాణికుల రాకపోకల మీద ప్రభావం చూపినా.. ట్రాఫిక్ కష్టాలతో మళ్లీ అందరూ నెమ్మదిగా మెట్రో బాట పడుతున్న పరిస్థితి. అయితే.. దీనికి మెట్రో టైమింగ్స్ సరిగా లేవన్న విమర్శ ఉంది.

మహానగరాల్లో ఉదయాన్నే ప్రయాణాలు మొదలై.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగుతుంటాయి. కానీ.. మెట్రో రైల్ టైమింగ్స్ పరిమితంగా ఉన్న పరిస్థితి. ఈ మధ్యనే మెట్రో టైమింగ్స్ లో మార్పులు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. తాజాగా మెట్రో రైలు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రేపటి (సోమవారం) నుంచి ఉదయం ఏడు గంటలకే మొదటి ట్రైన్ పట్టాల మీదకు రానుంది. అప్పటి నుంచి రాత్రి 11.30 గంటల వరకు రైళ్లను నడుపుతున్నట్లుగా హైదరాబాద్ మెట్రో తాజాగా వెల్లడించింది. తాజాగా పెంచిన టైమింగ్స్.. నగర ప్రజలకు మరింత వెసులుబాటుతో పాటు.. మెట్రో రైలును వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తుందని చెప్పాలి. కోవిడ్ తర్వాత రోడ్ల మీద ట్రాఫిక్ భారీగా పెరిగిన నేపథ్యంలో.. ప్రయాణ వేగంలో కచ్ఛితంగా ఉండే మెట్రోరైల్ లో ప్రయాణం.. సమయాన్ని ఆదా చేస్తుందని చెప్పక తప్పదు.