Begin typing your search above and press return to search.

మ‌న మెట్రోను మోడీ స్టార్ట్ చేసేది ఇక్క‌డ నుంచే..!

By:  Tupaki Desk   |   29 Oct 2017 6:00 AM GMT
మ‌న మెట్రోను మోడీ స్టార్ట్ చేసేది ఇక్క‌డ నుంచే..!
X
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మ‌ణిపూస లాంటి మెట్రో రైల్ ను న‌వంబ‌రు 28 నుంచి 30 మ‌ధ్య స్టార్ట్ కానున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోడీ కోసం మూడు రోజులు రిజ‌ర్వ్ చేసిన కేసీఆర్‌.. మీకు అనుకూల‌మైన తేదీని చెప్పాలంటూ ప్ర‌ధానిని కోరారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌ధాని కార్య‌ల‌యం నుంచి ఓకే అన్న మాట రాలేదు. అయితే.. ఈ తేదీల్లోనే హైద‌రాబాద్ లో బిజినెస్ స‌మ్మిట్ జ‌ర‌గ‌నుండ‌టం.. దీనికి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా రానున్న నేప‌థ్యంలో మోడీ హాజ‌రు త‌ప్ప‌నిస‌రి.

మెట్రోను ఏ తేదీ నుంచి స్టార్ట్ చేయాల‌న్న దానిపై ఇప్ప‌టికి ఒక స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికీ.. ఏ స్టేష‌న్ నుంచి మెట్రోను ప్రారంభించాల‌న్న అంశంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తొలిద‌శ‌లో మియాపూర్ నుంచి నాగోల్ వ‌ర‌కు మెట్రోను న‌డ‌ప‌నున్నారు. తొలిద‌శ‌లో 24 స్టేష‌న్లు హైద‌రాబాదీయుల‌కు అందుబాటులోకి రానున్నాయి.

ఇదిలా ఉంటే.. మెట్రోను మియాపూర్ స్టేష‌న్ వ‌ద్ద ప్ర‌ధాని చేతుల మీదుగా ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తొల‌ద‌శ‌లో స్టార్ట్ చేసే స్టేషన్ల‌లో మియాపూర్ స్టేష‌న్ అతి పెద్ద‌దిగా చెబుతున్నారు.

మెట్రో రైల్‌కు సంబంధించి అత్యంత ర‌ద్దీగా మారే స్టేష‌న్ కూడా మియాపూర్ స్టేష‌న్ కానుంది. మొద‌టి కారిడార్ లో మియాపూర్ కేంద్రంగా మెట్రో రైల్ డిపోను 105 ఎక‌రాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. మెట్రో ప్రారంభానికి హెచ్ ఐసీసీ నుంచి హెలికాఫ్ట‌ర్ లో మియాపూర్‌ కు చేరుకోనున్న మోడీ.. మెట్రో రైల్‌ ను ప్రారంభించిన త‌ర్వాత మ‌ళ్లీ బిజినెస్ స‌మ్మిట్‌ కు వెళ్ల‌నున్నారు. ఇందులో భాగంగా మియాపూర్ మెట్రో ప్రాంతంలో హెలిపాడ్ ను సిద్ధం చేస్తున్నారు. ప్ర‌ధాని ప్ర‌త్యేక భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సైతం మియాపూర్ ప్రాంతాన్ని ప్ర‌త్యేకంగా సంద‌ర్శించి.. ప‌రిశీలించి ఫైన‌ల్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.