Begin typing your search above and press return to search.

వెయ్యి దాటితే మెట్రో రైలు క‌ద‌ల‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   30 Nov 2017 4:54 AM GMT
వెయ్యి దాటితే మెట్రో రైలు క‌ద‌ల‌ద‌ట‌!
X
ట్రైన్ కానీ బ‌స్సు కానీ.. ఏ ప్ర‌జార‌వాణా చూసినా.. డిమాండ్ పెరిగిన‌ప్పుడు సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణికుల్ని ఎక్కించుకోవ‌టం క‌నిపిస్తుంది. ఈ కార‌ణంగానే వేలాడే జ‌నాల‌తో రైళ్లు.. ఆర్టీసీ బ‌స్సులు క‌నిపిస్తాయి. ప్ర‌మాదాల‌కు పూర్తిస్థాయిలో అవ‌కాశం ఉన్న ఇలాంటి తీరుకు హైద‌రాబాద్ మెట్రో చెక్ చెప్పింది.

ఒక్కో మెట్రో రైల్లో (మూడు బోగీలు ఉన్న‌) వెయ్యి మంది ప్ర‌యాణికులు మాత్ర‌మే ప్ర‌యాణిస్తారు. మ‌రి.. అంత‌కు మించి ప్ర‌యాణికులు ఎక్కితే? అన్న ప్ర‌శ్న‌ను వేసుకుంటే ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది. మెట్రో రైల్లో సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణికులు ఎక్కిన మ‌రుక్ష‌ణం.. బ‌య‌లుదేరాల్సిన రైలు అడుగు ముందుకేయ‌దు. అంతేనా.. రైలు త‌లుపులు మూసుకుపోవు.

ఎందుకిలా అంటే.. సామ‌ర్థ్యానికి మించి రైల్లో ప్రయాణికులు ఓవ‌ర్ లోడ్ అయిన వెంట‌నే అలెర్ట్ చేసే వ్య‌వ‌స్థ‌ను హైద‌రాబాద్ మెట్రోలో ఏర్పాటు చేశారు. వెయ్యి అంకె దాటిన వెంట‌నే బోగీల త‌లుపులు మూసుకోవు. దీంతో అక్క‌డి సిబ్బంది మెట్రో రైల్లో ఉన్న వారిని దించేస్తారు. ఇలాంటి అనుభ‌వం అమీర్ పేట స్టేష‌న్లో చోటు చేసుకుంది. కిక్కిరిసిపోయిన అమీర్ పేట స్టేష‌న్లో ప్ర‌యాణికుల పెద్ద ఎత్తున కోచ్ ల‌లో ఎక్క‌టంతో మెట్రో రైలు అడుగు ముందుకు వేయ‌లేదు. దీంతో.. సిబ్బంది రంగంలోకి దిగి రైలెక్కిన ప్ర‌యాణికుల్ని కింద‌కు దించేశారు. మొద‌టి రోజున మెట్రో రైల్లో ల‌క్ష మందికి పైగా ప్ర‌యాణికులు ప్ర‌యాణించిన‌ట్లుగా హైద‌రాబాద్ మెట్రో ప్ర‌క‌టించింది. రానున్న రోజుల్లో ఇది కాస్తా రెండు ల‌క్ష‌ల‌కు చేరుకోవ‌టం ఖాయ‌మంటున్నారు. మెట్రో రైలు సూప‌ర్ హిట్ అయ్యిన‌ట్లేన‌న్న అభిప్రాయం మెట్రో వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.