Begin typing your search above and press return to search.

పరిహారంతో పాపం కడిగేసుకునే పనిలో మెట్రో

By:  Tupaki Desk   |   23 Sep 2019 11:10 AM GMT
పరిహారంతో పాపం కడిగేసుకునే పనిలో మెట్రో
X
హైదరాబాద్ మెట్రో పిల్లర్ పై భాగంలో ఉన్న సిమెంటు పెచ్చు ఊడి పడటం కారణంగా ఆదివారం సాయంత్రం మరణించిన మౌనిక మరణంపై తాజాగా హైదరాబాద్ మెట్రో సంస్థ భాగస్వామి అయినా ఎల్ అండ్ టీ తాజాగా రియాక్ట్ అయ్యింది. నాణ్యత లోపం కారణంగా పెచ్చులు ఊడిపోయిన ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన మౌనికకు పరిహారంగా రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పరిహారం విషయంపై ఎల్ అండ్ టీ స్పందించకపోవటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ప్రమాదానికి బీమా వర్తిస్తుందో లేదో తెలీదని.. అలా వచ్చిన మొత్తాన్ని మాత్రమే బాధిత కుటుంబానికి ఇస్తామన్న మాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ దిగి వచ్చింది.

బాధిత కుటుంబానికి రూ.20లక్షల పరిహారంతో పాటు.. మౌనిక కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చేందుకు సదరు సంస్థ ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి హరికాంత్ రెడ్డి సతీమణి మౌనిక. తన తమ్ముడ్ని అమీర్ పేట హాస్టల్ లో చేర్పించటం కోసం అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద నిలుచోవటం.. పై నుంచి సిమెంటు పెచ్చు ఊడి కిందపడింది.

ఈ క్రమంలో ఒక సిమెంటు పెళ్ల ఆమె తల మీద పడటంతో.. ఘటనాస్థలంలోనే ఆమె మరణించిన వైనం తెలిసిందే. ఇప్పటివరకూ సాంకేతిక సమస్యలు మాత్రమే ఎదుర్కొంటున్న హైదరాబాద్ మెట్రో.. తొలిసారి నిర్మాణపరమైన లోపాల్ని కూడా ఎదుర్కొంటుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తమ నిర్లక్ష్యం కారణంగా మరణించిన మౌనిక కుటుంబానికి పరిహారం.. ఉద్యోగం ఇవ్వటం ద్వారా తమ పాపాన్ని కడిగేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.