Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కి మెట్రో కాక‌.. ధ‌ర‌ల‌పై ఆందోళ‌న‌

By:  Tupaki Desk   |   29 Nov 2017 2:32 PM GMT
కేసీఆర్‌కి మెట్రో కాక‌.. ధ‌ర‌ల‌పై ఆందోళ‌న‌
X
హైద‌రాబాద్ మెట్రో రైలు కూత లేకుండానే ప‌రుగులు పెట్టేస్తోంది! దీంతో గంట‌ల త‌ర‌బ‌డి చేసే ప్ర‌యాణాలు క్ష‌ణాల్లోకి వ‌చ్చేశాయి. అంతేకాదు, టీఎస్ ఆర్టీసిపై పెను ప్రభావం కూడా ప‌డిపోయింది. నిన్న ప్రారంభ‌మైన మెట్రో రైలులో బుధ‌వారం ప్ర‌యాణించేందుకు ప్ర‌యాణికులు ఆయా స్టేష‌న్ల‌కు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. అత్యంత వేగంగా గ‌మ్యాల‌ను చేరుకోవ‌డం, కుదుపు, అదుపులేని ప్ర‌యాణం కావ‌డం, చ‌క్క‌ని వాతావ‌ర‌ణాన్ని.. న‌గ‌ర సౌంద‌ర్యాన్ని వీక్షిస్తూ.. క‌న్నుల పండ‌గ చేసుకోవ‌డం వంటి అనేక ఫీచ‌ర్లు ఉండ‌డంతో రోజు వారీ ప్ర‌యాణికులు ఎక్కువ‌గా మెట్రో స్టేష‌న్ల ముందు క్యూకట్టేశారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మెట్రో రాక‌తోపాటు భారీ ఎత్తున కాక మొద‌లైంది. దీనికి కార‌ణం.. మెట్రో చార్జీలు అదిరిపోవ‌డ‌మే!! ముందు భారీ ఎత్తున డ‌బ్బులు క‌ట్టి రిచార్జ్ కార్డు కొనుగోలు చేయ‌డం త‌ర్వాత రిచార్జ్ చేయించుకోవడం వంటివి సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని అప్పుడే నిర‌స‌న‌ల‌కు సిద్ధ‌మైపోతున్నారు జ‌నాలు. వీరికితోడుగా కాంగ్రెస్ నేత‌లు కూడా చ‌క‌చ‌కా ఆందోళ‌న‌కు శ్రీకారం చుడుతున్నారు. మెట్రో ప్రయాణం బాగుందని చెప్తున్న ప్రయాణికులు ధరల విషయంలో మాత్రం తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రో ధరలను కొంచెమైనా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇక‌, కేసీఆర్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్‌కు ఈ మెట్రో ధ‌ర‌ల అంశం అందివ‌చ్చిన అవ‌కాశంగా మారిపోయింది. దీంతో ఆ పార్టీ నేత‌లు మీడియా మీటింగ్‌లు పెట్టి మ‌రీ మెట్రో ధ‌ర‌ల‌పై దంచేస్తున్నారు. మెట్రో ధరలను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాల‌ని నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్ బుధ‌వారం హెచ్చ‌రించేశారు కూడా. హైద‌రాబాద్‌లో ఒక్క కేసీఆర్ కుటుంబ‌మే బ‌త‌కడం లేద‌ని, కూలి , నాలి చేసుకుని, నెల‌కు రూ.5 ఆరు వేల‌తో బ‌తుకులు ఈడుస్తున్న వాళ్లు అనేక మంది ఉన్నార‌ని వారికి మెట్రో చార్జీలు భారం కాదా? అని ప్ర‌శ్నించారు. ఇక‌, మెట్రో ఆలస్యానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని, పెరిగిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అన్నారు. మొత్తానికి మెట్రో రాగానే సంబరం అయిపోలేద‌ని, ఇప్పుడు ధ‌ర‌ల విష‌యంలో పెరుగుతున్న కాక‌ను స‌ర్దుబాటు చేయ‌డం కేసీఆర్‌కు త‌ల‌నొప్పి తెచ్చే విష‌య‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.