Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో... ఓ అద్భుతం!

By:  Tupaki Desk   |   22 July 2015 7:16 AM GMT
హైదరాబాద్ మెట్రో... ఓ అద్భుతం!
X
హైదరాబాద్ నగర మెట్రోప్రాజెక్టు ఒక ఇంజినీరింగ్ అద్భుతం! ఈ ప్రాజెక్టు ప్రగతి, నిర్మాణ విశిష్టతలు భవిష్యత్తు లో ఇంజినీరింగ్ విద్యార్థులకు పాఠాలు కాబోతున్నాయి! ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రాజెక్టు ఇదే అని మెట్రో రైల్ ఎండీ చెబుతుంటే ఏమిటో అనుకున్నారు కానీ... రోజు రోజుకూ పురివిప్పిన నెమలిలా, విచ్చుకుంటున్న గులాబీలా ఎంతో అందంగా తయారవుతుంది మన హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణం!

ఎన్నో అద్భుతాలు, మరెన్నో రికార్డులు, ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది హైదరాబాద్ మెట్రో! అన్నీ అనుకూలంగా జరిగితే 2017 జూన్ నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తికావచ్చు! ఈ మొత్తం ప్రాజెక్టు మెట్రో రైలు మార్గం అక్షరాలా 72 కిలో మీటర్లు!

మెట్రో విశిష్టతలు మరికొన్ని చూస్తే... మొత్తం మూడు కారిడార్ల కు కలిపి 72 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టు లో 2800 పిల్లర్లు ఉన్నాయి. వీటీలో ఇప్పటీకే 1886 పిల్లర్లు అంటే సుమారు 49 కి.మీ. దూరం పూర్తయినట్లే! ఇంకా 23 కి.మీ. పూర్తయితే మెట్రోకి పూర్తి రూపం వచ్చేసినట్లే! ఇక మెట్రో ట్రైన్ ట్రాక్ విషయానికి వస్తే అది పూర్తిగా 172 కి.మీ.! వీటిలో ఒక్కో పిల్లర్ కు సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు కాగా... ఒక్కో పిల్లరు సుమారు 4వేల టన్నుల బరువు మోయగలదు! వీటి ఎత్తు భూమి నుంచి 14 - 34 మీటర్లు ఉంటుంది!

ఇక ఈ ప్రాజెక్టు కు సుమారు 2.60 లక్షల టన్నుల స్టీలు ఉపయోగించగా, 26 లక్షల టన్నుల సిమెంటు వినియోగించారు! ఈ మెట్రో కారిడార్ ద్వారా సుమారు 18.5 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరగనుంది! ఈ ప్రాజెక్ట్ కోసం 2500 మంది ఇంజినీర్లు, 17,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు!

ఇక రైలు, బోగీలు, వాటి వేగం, టిక్కెట్ ధర మొదలైన వాటి విషయానికి వస్తే... మొత్తం మూడు కారిడార్ల లో నడిచే రైళ్లు 57! ఒక్కో రైలులో సుమారు 1000 మంది ప్రయాణించొచ్చు! ఈ రైళ్ల వేగం కనిష్టంగా 30 గరిష్టంగా 90 కేఎంపీహెచ్ ఉంటుంది! ఇక టిక్కెట్టు ధర విషయాని కొస్తే... కనిష్టంగా రూ. 10 ఉండగా గరిష్టంగా రూ. 50 వరకూ ఉండే అవకాశం ఉంది! అయితే వీటి ధరలు అధికారికంగా ఇంకా నిర్ణయించలేదు!

మరో విషయం ఏమిటంటే... నిర్మాణ దశ లోనే ఈ ప్రాజెక్టు 5 అవార్డులను సాధించింది! ఏసీఐ, గోల్డ్ అవార్డ్, గ్లోబర్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్, స్ట్రాటజిక్ గ్లోబల్ ప్రాజెక్ట్, కనస్ట్రక్షన్ వీక్ అనే అవార్డులు పొందింది!