Begin typing your search above and press return to search.

ఇప్పటికి అంత మంది ప్రాణాల్ని తీసిన ఎంఐ 17 వీ5

By:  Tupaki Desk   |   9 Dec 2021 4:32 AM GMT
ఇప్పటికి అంత మంది ప్రాణాల్ని తీసిన ఎంఐ 17 వీ5
X
సమర్థతకు.. సామర్థ్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఎంఐ 17 వీ5 హెలికాఫ్టర్ తాజాగా చోటు చేసుకున్న ప్రమాదం.. దాని ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేలా మారిందని చెప్పాలి. భారత వాయుసేనలో అత్యంత కీలకంగా భావించే ఈ సైనిక హెలికాఫ్టర్ సామర్థ్యం చాలా గొప్పగా అభివర్ణిస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించే అవకాశం ఉన్న ఈ హెలికాఫ్టర్లు క్యారియర్లుగా ఉపయోగపడుతుంటాయని చెబుతారు.

నాణెనికి ఒకవైపు సామర్థ్యం ముద్ర కనిపిస్తే.. మరోవైపు ఈ భారీ హెలికాఫ్టర్లు గడిచిన పదేళ్లలో భారీగా ప్రాణాలు తీసిన వైనం పంటి కింద రాయిలా తగులుతూనే ఉంటుంది. ఇప్పటివకు ఈ హెలికాఫ్టర్లుక్రాష్ కావటంతో 42 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాజాగా సీడీఎస్ బిపిన్ రావత్.. ఆయన సతీమణి మధుళికతో సహా మొత్తం 14 మంది మరణించిన ఘోర ప్రమాదానికి ముందు.. పలు విషాద ఉదంతాలు ఈ మోడల్ హెలికాఫ్టర్ మూలంగా చోటు చేసుకున్నాయన్న మాట వినిపిస్తోంది.

రష్యాకు చెందిన ఈ హెలికాఫ్టర్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. తక్కువలో తక్కువ వంద దేశాలకు పైనే వీటిని వినియోగిస్తుంటారు. అంతేకాదు.. ఈ రకం హెలికాఫ్టర్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 13వేలకు పైనే వినియోగంలో ఉన్నాయని చెబుతారు. అంతటి ఆదరణ పొందిన ఈ హెలికాఫ్టర్ల ట్రాక్ రికార్డును చూసినప్పుడు.. పదకొండేళ్ల క్రితం తొలి ప్రమాదం దేశంలో చోటు చేసుకుంది. 2010 నవంబరు 19న తవాంగ్‌ నుంచి గువహాటికి బయల్దేరిన ఐదు నిమిషాలకే బొందిర్‌ అనే కొండల నడుమ హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు.

ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న రెండేళ్ల తర్వాత 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని ఎయిర్‌ బేస్‌ నుంచి బయల్దేరిన హెలికాప్టర్‌ కొద్ది సేపటికే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. తర్వాత తొమ్మిది నెలల వ్యవధిలోనే అంటే.. 2013 జూన్ 25న వదర సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్‌ కేథార్‌నాథ్‌ నుంచి గుప్తకాశికి వస్తుండగా గౌరీకుండ్‌ దగ్గర క్రాష్‌ కావటంతో.. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్ర గాయాలు అయ్యాయి.

అనంతరం 2017 అక్టోబరు 6న అరుణాచల్‌ ప్రదేశ్‌లో వివాస్పద తవాంగ్‌ ఏరియాలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో అడవుల్లో కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సిబ్బంది మరణించారు. తర్వాత మరో ఏడునెలల వ్యవధిలోనే మరో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. 2018 ఏప్రిల్ 18న ఉత్తర్‌ఖండ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుప్తకాశి నుంచి కేదార్‌నాథ్‌ బయల్దేరిన చాపర్‌ ల్యాండింగ్‌ సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. పైలెట్లు ఏంతో నేర్పుగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆరుగురు క్రూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు.

అనంతరం మరో పది నెలల వ్యవధిలో అంటే 2019 ఫిబ్రవరి 27న శ్రీనగర్‌ ఎయిర్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి రోటీన్‌ వర్క్‌లో భాగంగా టేకాఫ్‌ అయిన విమానం పది నిమిషాలకే శ్రీనగర్‌ సమీపంలోని బుడ్‌గామ్‌ దగ్గర కూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం అనంతరం మళ్లీ ప్రమాదం చోటు చేసుకోలేదు. తాజా ఘోర ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్.. ఆయన సతీమణితో పాటు మొత్తం 14 మంది దుర్మరణం పాలు కావటం యావత్ దేశాన్ని విషాదంలోకి ముంచెత్తేలా చేసింది. గతంలో సమర్థతకు మారుపేరుగా చెప్పే ఈ హెలికాఫ్టర్లు..ఇప్పుడు మరణానికి కేరాఫ్ అడ్రస్ గా మారాయన్న మాట మొదలైంది.