Begin typing your search above and press return to search.

ఇప్పుడు మిచెల్లీ వంతు... ట్రంప్ కు వాయింపు!

By:  Tupaki Desk   |   14 Oct 2016 9:46 AM GMT
ఇప్పుడు మిచెల్లీ వంతు... ట్రంప్ కు వాయింపు!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ ని దొరికిన వాళ్లు దొరికినట్లు ఏకిపారేస్తున్నారు. రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్న అతడి గత "వైభవం"పై ఒకపక్క మీడియా - మరోపక్క హిల్లారీ వాయించేస్తుండగా, మిగిలిన నేతలు కూడా తలోచెయ్యీ వేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో అమెరికా ప్రథమ పౌరురాలు మిచెల్లీ ఒబామా చేరారు. మహిళలు, సెక్స్‌ పై ట్రంప్ చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు సహించరానివని మొదలుపెట్టిన మిచెల్లీ... ట్రంప్ ఇక పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలని గట్టిగా హెచ్చరించారు.

డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మిచెల్లీ... ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలు చాలని, ఇకపై ఆ ప్రేలాపనలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఇదే క్రమంలో మహిళలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని - సాధారణ మనిషిలా కూడా ఆయన ప్రవర్తించడం లేదని ఆమె నిప్పులు చెరిగారు. మహిళలను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, వారిని అసభ్యంగా తాకుతూ పైశాచికానందం పొందడం తీవ్రమైన నేరాలేనని... లైంగిక స్వేచ్ఛ అంటే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదని మిచెల్లీ గట్టిగా చెప్పారు.

కాగా, ఇటీవల ముగ్గురు మహిళలు తమను లైంగిక వేధించాడని, అనుమతి లేకుండా తమను బలవంతంగా ముద్దులు పెట్టుకున్నాడని, తాకరాని చోట్ల తాకాడని ట్రంప్‌ పై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కూడా మీడియాల్లో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/