Begin typing your search above and press return to search.

మనోడి రీఎంట్రీతో చైనా ఫోన్లకు చుక్కలేనా?

By:  Tupaki Desk   |   17 Oct 2020 4:45 AM GMT
మనోడి రీఎంట్రీతో చైనా ఫోన్లకు చుక్కలేనా?
X
సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న పరిణామాలతో భారత్ - చైనా మధ్య సంబందాలు దారుణంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. సరిహద్దుల వద్ద బలుపుతో వ్యవహరించే చైనా మీద ఆగ్రహంతో భారతీయులు పలువురు చైనా వస్తువుల్ని కొనటం మానేశారు. అయితే.. అన్నింటిలోనూ ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరీ.. ముఖ్యంగా నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చేతిలో ఉండే సెల్ ఫోన్ విషయంలో తప్పనిసరిగా రాజీ పడాల్సిందే. ఎందుకంటే.. ఇవాల్టికి చైనా ఫోన్లే భారత మార్కెట్ ను ఏలేస్తున్నాయి. ఇలాంటివేళ.. గతంలో తమ బ్రాండ్ తో ఒక ఊపు ఊపిన మైక్రోమ్యాక్స్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

స్మార్ట్ ఫోన్లకుకాస్త ముందు దేశీయంగా తయారుచేసిన మైక్రోమ్యాక్స్ ఫోన్లుసంచలనంగా మారటమే కాదు.. అతి తక్కువ వ్యవధిలోనే భారీగా మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయి. ముగ్గురు భాగస్వాములతో మొదలైన మైక్రో మ్యాక్స్.. తర్వాతి కాలంలో చేసిన పొరపాట్లతో కనుమరుగైంది. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లు రావటం.. వివిధ మోడళ్లను భారీగా చెప్పిన చైనా కంపెనీలతో భారత మొబైల్ మార్కెట్ మొత్తం వారి సొంతమైన దుస్థితి.
ఇవాళ భారీగా అమ్మకాలు జరుపుతూ.. భారత మొబైల్ మార్కెట్ లో టాప్ బ్రాండ్లుగా చెబుతున్న షియోమీ.. రియల్ మీ.. ఒప్పో.. వివో.. వన్ ప్లస్ లాంటి కంపెనీలన్ని చైనావే. వీటిని తలదన్నే భారత బ్రాండ్లు ఏవీ ఇప్పుడు మార్కెట్లో లేవు. ఇలాంటి వేళ.. మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మ (సినీ నటి ఆసిన్ భర్త) తెర మీదకు వచ్చారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. తన కంపెనీ ప్రస్థానం గురించి చెప్పిన ఆయన.. తాము కొన్ని తప్పులు చేశామని.. వాటిని సరిదిద్దుకొని మళ్లీ వస్తున్నట్లుగా చెప్పారు.

సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల్ని రేఖా మాత్రంగా ప్రస్తావిస్తూ.. తన భావోద్వేగ సందేశంతో.. మనోడి ఫోన్లు వచ్చేస్తున్నాయన్న మెసేజ్ ను భారతీయులకు పంపే ప్రయత్నం చేశారు. ప్రదాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్బర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా తాము మళ్లీ మార్కెట్లోకి వస్తున్నట్లుగా చెప్పారు. వ్యాపారం చేస్తూ కొన్ని పాఠాలు నేర్చుకున్నామని.. అలా అని పూర్తిగా వదిలేయలేదన్న ఆయన.. త్వరలోనే వస్తున్నామని.. భారత్ తరఫున ఉంటామని పేర్కొన్నారు.

ఒకప్పుడు బహుళ ఆదరణ పొందిన మైక్రోమ్యాక్స్ తాజాగా మార్కెట్లోకి రావటం కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. చైనా ఫోన్లతో పోటీ పడేలా టెక్నాలజీ.. నాణ్యత.. ధర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే.. ఆ ఫోన్లను ఆదరించేందుకు భారతీయులు సిద్దంగా ఉన్నారనే చెప్పాలి. మైక్రో మ్యాక్స్ కంపెనీలు బరిలోకి రావాలే కానీ.. వాటిని దేశ ప్రజలు మాత్రమే కాదు.. ప్రభుత్వం కూడా అండగా నిలవటానికి సిద్ధంగా ఉందని చెప్పాలి. ఇప్పటికే 177 చైనా యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం.. మొబైల్ ఫోన్ల మీద బ్యాన్ విధించే అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎందుకంటే.. చైనా కంపెనీలకు భారత మార్కెట్ చాలా ముఖ్యం. ప్రపంచంలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు వాడే దేశాల్లో మనది కూడా ఒకటి. 2019 లెక్కల ప్రకారం దేశంలో సుమారు 45 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. మన దేశంలో జరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వ్యాపారం ప్రతి ఏటా రూ.2.13లక్షల కోట్లు. అందులో సింహభాగం చైనా కంపెనీలవే. ఇలాంటివేళ.. భారతీయ కంపెనీలు బరిలోకి దిగి.. చైనాకు ధీటుగా ఫోన్లను తీసుకురాగలిగితే.. వాటిని ఆదరించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వేళలో మైక్రోమ్యాక్స్ రీఎంట్రీ ఇస్తానన్న ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.