Begin typing your search above and press return to search.

శ్రీకాకుళం జిల్లాలో మైక్రోసాఫ్ట్..?

By:  Tupaki Desk   |   15 Aug 2015 9:10 AM GMT
శ్రీకాకుళం జిల్లాలో మైక్రోసాఫ్ట్..?
X
ఇప్పటివరకూ హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన మైక్రోసాఫ్ట్ ఏపీలో కూడా కొలువు తీరనుందా? ఏపీని సాఫ్ట్ వేర్.. హార్డ్ వేర్ హబ్ గా మారుస్తానని ఏపీ ముఖ్యంత్రి తరచూ చెప్పటం తెలిసిందే. అందుకు తగ్గట్లే ఆయన పలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా.. మైక్రోసాఫ్ట్ ఎండీ అనిల్ బన్సారీ.. ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారు ఆలోచనలకు తగ్గట్లే తాము సేవలు అందిస్తామని వ్యాఖ్యానించారు. వినియోగంలో లేని టీవీ స్పెక్ట్రం ను ఉపయోగించి తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే వైట్ స్పేసెస్ ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్ ఏపీలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాలో తమ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

వైట్ స్పేసెస్ ప్రాజెక్టుకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్ట్ ను శ్రీకాకుళంలో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే.. సామాన్యులకు సైతం ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావచ్చని చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఏపీలోని ప్రతి ఇంటికి చౌకగా ఇంటర్నెట్ సేవల్ని అందిస్తామని హామీ ఇవ్వటం తెలిసిందే. ఆ హామీని తాజాగా మైక్రోసాఫ్ట్ తో జత కట్టి అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ.. ఒక ప్రాజెక్టును శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతంలో స్టార్ట్ చేయటం ఏపీకి ఎంతోకొంత మేలు చేయటంతో పాటు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. చర్చల్లో ఉన్న ప్రాజెక్టు త్వరగా పట్టాల మీదకు ఎక్కితే సీమాంధ్రులకు కావాల్సిందేముంటుంది..?