Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ !

By:  Tupaki Desk   |   22 July 2021 3:30 PM GMT
హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ !
X
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్ కు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధ‌మైంది.  హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి మైక్రోసాఫ్ట్ రెడీ అయిన‌ట్లు వార్తలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద డేటా సెంటర్ రాబోతున్నది. ఇందుకోసం టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సంస్థ సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ డేటా సెంటర్ కోసం హైదరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ కలిసి ఒక స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్లుగా సమాచారం.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) పరంగా అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్దమైందని తెలుస్తుంది.  ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో అధికారికంగా వెలువడే అవకాశముంది. రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ 2019లో భారతదేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ హైదరాబాద్‌ లో రూ.20 వేల కోట్లతో డాటా సెంటర్‌ ను శంషాబాద్ స‌మీపంలోని హైతాబాద్‌ లో ఏర్పాటు చేస్తోంది. డాటా సెంటర్స్‌ విభాగంలో భారత్‌ కు వచ్చిన అతిపెద్ద ఎఫ్‌ డీఐ ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ సైతం హైదరాబాద్‌ లోనే రూ.15 వేల కోట్లతో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ ప్ర‌తిపాద‌న‌లు ఫ‌లించి మైక్రోసాఫ్ట్‌ డాటా సెంటర్‌ ఏర్పాటు ఖరారైతే, ఇది ఈ విభాగంలో హైదరాబాద్‌ కు వచ్చిన రెండో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కానుంది. బిఎఎమ్ రియాల్టీ బ్రాండ్ పేరుతో భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్ ను రూపొందించినట్లు తెలిపింది. 2024 కల్లా భారత్‌ లో డేటా సెంటర్ల ఆదాయం 4 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌ లో త్వరలో తన స్పెషలైజ్డ్ డేటా సెంటర్‌ ను ఏర్పాటు చేయనుంది.