Begin typing your search above and press return to search.

రంగంలోకి హ్యాకర్లు: ట్రంప్ గెలుపుకు రష్యా, ఓటమి కోసం చైనా, ఇరాన్

By:  Tupaki Desk   |   16 Sep 2020 4:30 PM GMT
రంగంలోకి హ్యాకర్లు: ట్రంప్ గెలుపుకు రష్యా, ఓటమి కోసం చైనా, ఇరాన్
X
నవంబర్ నెలలో అమెరికా ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా నెలన్నర రోజులు మాత్రమే ఉన్న సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విదేశీ హ్యాకర్ల హెచ్చరికలను జారీ చేసింది. ప్రధానంగా రష్యా, చైనా, ఇరాన్ నుండి ఎన్నికలకు ముప్పు పొంచి ఉంటుందని పేర్కొంది. 2016లో కూడా విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగారు. ఈసారి కూడా హ్యాకర్ల ముప్పు ఉంటుందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ట్రంప్ గెలుపును కోరుకునే రష్యా, ట్రంప్ ఓడిపోవాలని భావించే చైనా, ఇరాన్ నుండి హ్యాకర్లు పెద్ద ఎత్తున ప్రజల తీర్పును తారుమారు చేసే వ్యూహం పన్నుతున్నారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది.

గత అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సందేశాలు, వీడియో క్లిప్స్, సోషల్ మీడియా సందేశాలు ఓటర్లకు చేరలేదని, దీని వెనుక రష్యా హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈసారి ఇప్పటికే హ్యాకర్లు రంగంలోకి దిగినట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ట్రంప్, బిడెన్ ప్రచారంపై సైబర్ రాడార్ పెట్టారని, రెండు వందల కంపెనీల సాయంతో రష్యా హ్యాకింగ్ చేస్తున్నట్లుగా తెలిపింది. బ్రిటన్ ఎన్నికల్లోను తలదూర్చిన స్ట్రోంటియం గ్రూప్ ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగిందని తెలిపింది. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు దీంతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపింది.

రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ జీఆర్‌యూ మిలిటరీ సర్వీసెస్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంది స్ట్రోంటియం గ్రూప్. సైబర్ దాడులకు పెట్టింది పేరు. అమెరికాలో సైబర్ దాడుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తప్పు పట్టించే పనిలో పడిందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. రష్యా సైబర్ దాడులు అడ్డుకున్నప్పటికీ, ఇప్పుడు చైనా, ఇరాక్‌లు కూడా సైబర్ దాడులకు సిద్ధమయ్యాయని హెచ్చరించింది. పార్టీలు, నేతలు వాడుతున్న సోషల్ మీడియా యాప్స్‌లలో లొసుగులు ఉన్నట్లు తెలిపింది మైక్రోసాఫ్ట్. ట్రంప్, జోబిడెన్ దగ్గరి వారి మెయిల్స్ హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోందని తెలిపింది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమంటే రష్యా, చైనా, ఇరాన్ ఈ విషయంలో ఒకరికి మరొకరు సహకరించుకుంటున్నట్లుగా కూడా మైక్రోసాఫ్ట్ అభిప్రాయపడింది. చైనా హ్యాకింగ్ దిగ్గజం జిర్కోనియం ఇప్పటికే రంగంలోకి దిగందని, ఇందుకు అమెరికాలో ఉంటున్న చైనీస్ విద్యార్థులను ఉపయోగించుకుంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో దాదాపు వెయ్యిమంది చైనా వీసాలను రద్దు చేసింది అగ్రరాజ్యం. ఇరాన్ హ్యాకింగ్ సంస్థ పాస్పరస్ అయితే ఏకంగా వైట్ హౌస్ అధికారులపై నిఘా పెట్టిందని వెల్లడించింది. గూగుల్ కూడా ఈ విధమైన ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆరోపణలను ఆ మూడు దేశాలు ఖండించాయి.