Begin typing your search above and press return to search.

డేంజర్:రెండురోజులు - మూడు విమానాలు!

By:  Tupaki Desk   |   3 Aug 2016 11:18 AM GMT
డేంజర్:రెండురోజులు - మూడు విమానాలు!
X
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంతో ఒకపక్క ప్రమాదాలు జరుగుతుంటే.. మరో వైపు పైలట్లు మద్యం సేవించి విమానాలు నడుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మలేషియా విమానమైతే ఏమైందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ క్రమంలో విమాన ప్రయాణం అంటే.. గాల్లో ప్రయాణించడమే కాదు - ప్రాణాలను కూడా గాల్లో పెట్టడమే అని భావించాల్సిన పరిస్థితి! తాజాగా దుబాయ్ లో ఒక విమానం క్రాష్ ల్యాండ్ అవ్వడం - ఇండిగోకు చెందిన రెండు విమానాలు ఆకాశంలోనే దాదాపు ఢీకొనే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. మరో విమానం సాంకేతిక లోపంతో ఎక్కడ నుండి బయలుదేరిందో అక్కడికే తిరిగి వెళ్లిపోయింది!

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు.. తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎమిరెట్స్‌ 777 విమానం దుబాయ్‌ లో పెనుప్రమాదానికి గురైంది. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతుండగా క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. దీంతో విపరీతమైన పొగలు - మంటలు చెలరేగిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణహాని తప్పింది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ల వల్ల ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు.

ఇదే క్రమంలో దుబాయ్‌ నుంచి వస్తున్న జెట్‌ ఎయిర్‌ వేస్‌ కు చెందిన ఈ (9డబ్ల్యూ531) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్‌ ఈ విషయాన్ని గుర్తించి.. మంగళూరు ఎయిర్‌ పోర్టులో ల్యాండింగ్‌ అయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే, విమానం ల్యాండింగ్‌ కు మంగళూరు విమానాశ్రయంలో అధికారులు అనుమతించకపోవడంతో తిరిగి దుబాయ్‌ వెళ్లిపోవాల్సి వచ్చింది. సాంకేతిక లోపం ఉన్నా కూడా ఈ విమానం సేఫ్ గానే దుబాయ్ కి చేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ రెండు విమానాల సంగతి అలా ఉంటే.. ఇండిగోకు చెందిన రెండు విమానాలు వెంట్రుకవాసిలో గాల్లోనే ఢీకొనేముప్పును తప్పించుకున్నాయి. అయినప్పటికీ ఒకదానికొకటి రాపిడి చేసుకుని ప్రయాణికులను బెంబేలెత్తించాయి. గగనతలంలో సంభవించిన ఈ ఊహించిన ప్రమాదంలో దాదాపు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముంబై నుంచి గువాహటికి ఇండిగో విమానం వస్తుండగా.. అదే సమయంలో చెన్నై వెళ్లే మరో ఇండిగో విమానం టేకాప్‌ తీసుకుంది. ఆ సమయంలో ఆ రెండు విమానాలు ఎదురెదురుగా రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా - సమన్వయలోపమా అనేది తెలియాల్సి ఉంది!