Begin typing your search above and press return to search.

చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యం .. ఢిల్లీలో భారత్-అమెరికా మంత్రుల భేటీ

By:  Tupaki Desk   |   27 Oct 2020 11:10 AM GMT
చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యం .. ఢిల్లీలో భారత్-అమెరికా మంత్రుల భేటీ
X
భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక చర్చలు ప్రారంభమైయ్యాయి. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ దీనికి వేదికగా మారింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్ భారత విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌ లతో హైదరాబాద్ హౌస్‌ లో సమావేశం అయ్యారు. 2 + 2 విధానంలో వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం అయ్యాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు దీనికి హాజరయ్యారు. కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నా అమెరికా కీలక మంత్రులు ఈ పర్యటనకు స్వయంగా రావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌తో సైతం అమెరికా మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్‌ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోంది.

భారత్-అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రుల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చైనా అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. తొలుత మైక్ పాంపియో చైనా విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తోన్న విధానాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల స్వేచ్ఛకు అవి విఘాతంలా మారే అవకాశం లేకపోలేదని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా రాజ్ ‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బేసిక్ ఎక్స్ ‌ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదరడం స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. రక్షణ, విదేశాంగ విధానాలు, కీలక సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఈ ఒప్పందాలు ఉపకరిస్తాయని అన్నారు.

ఒక దేశ రక్షణ, విదేశీ మంత్రులు మరో దేశ రక్షణ, విదేశీ మంత్రులతో జరిపే చర్చలను టు ప్లస్‌ టు చర్చలంటారు. ఒక దేశం తనకు అత్యంత కీలకమని భావించే మరో దేశంతో ఇలాంటి సమావేశాలు జరుపుతుంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్‌ బెకా కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్‌ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్‌ జియో శాటిలైట్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్‌ జిఎస్‌ఓఎంఐఏ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లాజిస్టికల్‌ ఎక్స్ చేంజ్‌ మెమొరాండమ్‌ అగ్రిమెంట్ ను 2016లో, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ ను 2018లో పూర్తి చేసుకుంది. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో మైక్ పాంపియో, మార్క్ టీ ఎస్పర్.. భారత్ సహా శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా పర్యటనలకు బయలుదేరి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా భారత్‌ ముప్పుగా పరిణమించిన చైనాను టార్గెట్ ‌గా చేసుకోవడం ద్వారా తమ దేశంలో స్థిరపడిన ప్రవాస భారతీయుల ఓటుబ్యాంకును ప్రభావితం చేయడానికి అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి.