Begin typing your search above and press return to search.

ఇద్దరు రెడ్లూ ఫెయిల్...రాజమండ్రిలొ వైసీపీ ఫ్లాప్ షో...?

By:  Tupaki Desk   |   27 Aug 2022 2:30 AM GMT
ఇద్దరు రెడ్లూ ఫెయిల్...రాజమండ్రిలొ వైసీపీ  ఫ్లాప్ షో...?
X
వైసీపీకి అన్నీ ఉన్నా అయిదవతనం లేదు అనడానికి 2019 ఎన్నికలలో అక్కడ వచ్చిన ఫలితాలే ఒక నిలువెత్తు ఉదాహరణ. రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ ఏపీలో అన్ని చోట్ల మాదిరిగానే జగన్ వేవ్ బలంగా వీచింది. అయినా సరే 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్, అర్బన్ రెండు సీట్లూ వైసీపీ దారుణంగా ఓడింది.

దానికి కారణం పార్టీకి ఆదరణ ఉన్నా నాయకులలో ఐక్యత లేకపోవడం. దాంతో కోరి మరీ ప్రత్యర్ధులకు బంగారు పళ్ళెంలో పెట్టి సీట్లను ఇచ్చేశారు. చూస్తూండగానే మూడేళ్ళు ఇట్టే గడచిపోయాయి. పోనీ ఏమైనా మార్పు కనిపించిందా అంటే లేదు, మరిన్ని తగవులు, ఇంకా వీడని కలహాలు.ఇదీ రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో వైసీపీ దైన్య స్థితి.

ఇక వైసీపీ అధినాయకత్వం తన వంతుగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. మొదట గోదావరి జిల్లాల ఇంచార్జిగా జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. ఆయన పార్టీలో ఎలాంటి మార్పూ తీసుకురాలేకపోయారు. పార్టీ పటిష్టతకు కృషి చేయలేకపోయారు. ఇక ఆయన్ని మార్చి మిధున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినా కూడా డిటో. ఆయన కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు అని అంటున్నారు.

టోటల్ గా చూస్తే రాజమండ్రి వైసీపీని చక్కదిద్దడం నానటికీ కష్టమవుతోంది. ఇక వైసీపీ తరఫున ఉన్న నాయకులు మూడు తగవులు ఆరు కలహాలుగా వెళ్లబుచ్చుతున్నరు. ఇంత పెద్ద నగరంలో పార్టీకి ఒక ఆఫీస్ అంటూ లేదు. లక్కీగా ఇలాంటి టైమ్ లో కూడా ఎంపీ సీటుని మార్గాని భరత్ గెలుచుకున్నారు. దాంతో ఆయన ఆఫీస్ లో మీటింగ్స్ జరుగుతాయి. లేకపోతే రూరల్ ఇంచార్జి ఆఫీస్ లో. అంతే తప్ప పార్టీకి అంటూ ఒక ఆఫీస్ లేకపోవడమే ఫ్యాన్ పార్టీ ఎంతలా రిపేరులో ఉందో అర్ధమవుతోంది అంటున్నారు.

ఇక మేయర్ ఎన్నికలు రాజమండ్రికి బకాయి ఉన్నాయి. మరో ఇరవై నెలలలో సార్వత్రిక ఎన్నికలు తోసుకువస్తున్నాయి. అయినా కానీ నాయకత్వ సమస్య అలా పట్టిపీడిస్తోంది. మేయర్, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పార్టీ అభ్యర్థులను ఈ రోజుకూ ఖరారు చేయలేదు. ఇటీవ‌ల నిర్వహించిన అనేక స‌ర్వేలు కూడా పార్టీకి ప్రతికూలత తప్పదని గుట్టు చెప్పేశాయి. అంటే ఈసారి ఎన్నికలు వస్తే కనుక రాజమండ్రిలో ఆశలు లేవు అన్న మాటే అంటున్నారు.

మరో వైపు చూస్తే మేయర్ ఎన్నికల కోసం ఇప్పటికే ముగ్గురు సమన్వయకర్తలను పార్టి మార్చి అయోయమయం క్రియేట్ చేసిది. వైసీపీకి ఇక్కడ గట్టి నాయకులే ఉన్నారు. వారిలో రౌతు సూర్య ప్రకాశరావు, శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల సత్యనారాయణ, కోడి ప్రవీణ్, అనసూరి పద్మలత, పంతం కొండల రావు, నక్కా శ్రీ నగేష్, జక్కంపూడి గణేష్ అంతా బలమైన వారే. కానీ ఒకరి పొడ మరొకరికి గిట్టదులా సీన్ ఉందిట. అదే వైసీపీ పాలిట శాపం అంటున్నారు. చిత్రమేంటి అంటే వీరిలో ఎవరిపైనా పార్టీ అధిష్టానం నమ్మకంగా లేదని కూడా టాక్ ఉంది.

ఏపీలో కీలకమైన రాజమండ్రి విషయంలో వైసీపీ అధినాయకత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి అని అంటున్నారు. సీఎం జగన్ నేరుగా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2024లో ఫ్యాన్ తిరుగుతుంది అని అంటున్నారు. లేకపోతే 2019 ఫలితాలే మళ్లీ వచ్చినా ఆశ్చర్యం లేదు అనేస్తున్నారు