Begin typing your search above and press return to search.

కదిలించే ‘వలస’ బతుకుల చిత్రాలు

By:  Tupaki Desk   |   15 May 2020 12:30 PM GMT
కదిలించే ‘వలస’ బతుకుల చిత్రాలు
X
‘విడిచిపెడితే నడిచే నే పోతాను సారు’ అంటూ వలస కార్మికుల పయనంపై ఇటీవల రిలీజ్ అయిన పాట అందరినీ కంటతడిపెట్టింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో వలస కార్మికులు సొంతింటికి వెళ్లిపోవడానికే మొగ్గుచూపుతున్నారు. లాక్ డౌన్ వేళ పనిలేక పక్కరాష్ట్రంలో ఆకలి చావులతో ఉండే బదులు.. సొంత రాష్ట్రానికి వెళ్లి కలోగంజో తాగి బతకడం మేలని సొంతూళ్లకు ఏ చిన్న దారి కనిపించినా వెళ్లిపోతున్నారు.

తాజాగా మేడ్చల్ రహదారిపై వలస కూలీల వెతలకు సజీవ సాక్ష్యంగా చిత్రాలు కనిపించాయి. కాలినడకన పయనమైన కొందరు కూలీలు తలా కొంత మొత్తం డబ్బులు సేకరించి ఓ లారీ మాట్లాడుకొని సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు పడ్డ పాట్లు కదిలించాయి.

ఒక లారీలో లేదా కంటైనర్ ట్రక్కులో మహా అయితే 50 మంది పడుతారు. కానీ వలస కూలీల దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ లారీలు, ట్రక్కుల్లో ఎంతమందినైనా ఎక్కించుకొని ఆ లారీ ఓనర్లకు మొత్తం డబ్బులు ఇచ్చేసి సొంత రాష్ట్రాలకు పోతున్న దైన్యం కనిపించింది.

మనిషికి రెండు వేలు అడుగుతున్నా సరే వలస కూలీలు ఒప్పుకున్నారు. లారీలో పోవడానికి ఉన్న డబ్బులు ఇచ్చి కుప్పలు కుప్పలుగా లారీలో పయనమవుతున్న దృశ్యాలు కదిలించాయి. మాస్కులు లేకుండా.. దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు కూర్చుంటూ ఇలా కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యాలు వలస జీవుల బతుకులు ఎంత దుర్భరమో చాటిచెప్పాయి..