Begin typing your search above and press return to search.

మా దేశం పేరుతో మీ ఊళ్లో కాల‌నీనా?

By:  Tupaki Desk   |   5 Dec 2017 4:03 AM GMT
మా దేశం పేరుతో మీ ఊళ్లో కాల‌నీనా?
X
ఒక దేశం పేరుతో ఒక మ‌హాన‌గ‌రంలో కాల‌నీగా ఏర్పాటు చేయ‌ట‌మా? భ‌లే ఉందే.. అని అనుకొని ఆగిపోకుండా వేలాది కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి మ‌రీ హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు చెక్ రిప‌బ్లిక్ రాయ‌బారి. త‌మ దేశం పేరుతో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలోని స‌న‌త్ న‌గ‌ర్ లో చెక్ కాల‌నీ పేరుతో ఏర్పాటు చేసిన కాల‌నీని చూసేందుకు రెక్క‌లు క‌ట్టుకొని వాలారు ఆ దేశ రాయ‌బారి మిల‌న్ హోవ‌ర్కా.

ఇంట‌ర్నెట్ ద్వారా తాను తెలుసుకున్న విష‌యాన్ని క‌ళ్లారా చూడాల‌న్న త‌ప‌న‌తో చెక్ రిప‌బ్లిక్ నుంచి వ‌చ్చిన పెద్ద మ‌నిషిని త‌మ‌దైన రీతిలో స్వాగ‌తం ప‌లికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు చెక్ కాల‌నీ. గోకుల్ థియేట‌ర్ ఎదురుగా ఉండే చెక్ కాల‌నీ మిగిలిన కాల‌నీల‌కు కాస్త భిన్నంగా ఉంటుంది. జెక్ కాల‌నీ పేరుతో ఉన్న బోర్డును చూసే వారు చాలామంది.. ఈ పేరు ఎందుకు వ‌చ్చింద‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

ఇంట‌ర్నెట్ లో త‌మ దేశం పేరుతో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఒక కాల‌నీకి అప్పుడెప్పుడో పేరు పెట్టుకున్న విష‌యాన్ని గుర్తించిన చెక్ రిప‌బ్లిక్ రాయ‌బారి తాజాగా హైద‌రాబాద్ వ‌చ్చారు. ఒక‌ప్పుడు త‌మ దేశానికి చెందిన ఇంజ‌నీర్లు గ‌డిపిన ప్రాంతాన్ని చూసి మైమ‌రిచిపోయారు. భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. త‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్ని ఢిల్లీలోని ఎంబ‌సీ ఆఫ్ చెక్ రిప‌బ్లిక్ కార్యాల‌యం నుంచి జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్‌కు లేఖ పంపారు.

చెక్ రాయ‌బారి ప‌ర్య‌ట‌న గురించి తెలుసుకున్న అధికారులు.. స్థానిక నేత‌లు స్థానికుల‌కు స‌మాచారం అందించారు. దీంతో అక్క‌డి కాల‌నీ వాసులు భిన్నంగా స్పందించారు. ఒక‌ప్పుడు త‌మ ప్రాంతానికి చెందిన వారు ఉన్న ప్లేస్ ను చూసేందుకు వ‌చ్చిన చెక్ రాయ‌బారికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. వీధుల్లో ముగ్గులు వేసి.. బ‌తుక‌మ్మ ఆడి వెల్ కం చెప్పారు. పారిశ్రామిక‌వేత్త ఒక‌రు ఆయ‌నింట్లో భోజ‌నానికి ఏర్పాట్లు చేశారు. నిజాం కాలంలో త‌మ దేశ‌స్తుల కోసం నిర్మించిన బంగ్లాల‌ను చూసిన స‌ద‌రు చెక్ రాయ‌బారి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఇంత‌కీ చెక్ కాల‌నీ పేరు ఎందుకు వ‌చ్చింది? అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యంలోకి వెళితే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. నిజాం కాలంలో స‌న‌త్ న‌గ‌ర్ లో బ్రెన్ గ‌న్ ఫ్యాక్ట‌రీ.. ఇప్పుడు దాని స్థానంలో ఓల్టాస్ కంపెనీ ఉంది. గ‌న్ ల త‌యారీకి వాడే ముడిస‌రుకులు ఇక్క‌డ త‌యార‌య్యేవి. వాటి త‌యారీకి అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త చెకోస్లేవేకియా ఇంజ‌నీర్ల వ‌ద్ద ఉండేది. దీంతో.. ఆ దేశం నుంచి పెద్ద సంఖ్య‌లో ఇంజ‌నీర్ల‌ను ర‌ప్పించారు. అయితే.. ఇక్క‌డి నివాసాలు వారికి అనుకూలంగా లేక‌పోవ‌టంతో తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యేవారు. ప‌లువురు త‌మ దేశానికి వెళ్లి పోయారు.

దీంతో.. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా ప్ర‌త్యేకంగా ఒక‌కాల‌నీని ఏర్పాటు చేసి దాదాపు 50 ఎక‌రాల్లో 52 బంగ్లాల‌ను నిర్మించారు.

చెకోస్లేవేకియ‌న్స్ గ‌డ్డ‌గా పిలిచే ఈ ప్రాంతం కాల‌క్ర‌మంలో చెక్ కాల‌నీగా రూపాంతరం చెందింది. నిజాం కాలంలో నిర్మించిన బంగ్లాల‌లో 45 అపార్ట్ మెంట్లు వెలిశాయి. మిగిలిన ప‌ది బంగ్లాలు నేటికీ చెక్కు చెద‌ర‌కుండా ఉన్నాయి. ఇంట‌ర్నెట్ లో ల‌భించిన స‌మాచారంతో భావోద్వేగానికి గురైన చెక్ రాయ‌బారి త‌మ పూర్వీకులు న‌డ‌యాడిన ప్లేస్‌ కు వ‌చ్చారు. త‌మ దేశ‌స్తుల‌తో గ‌డిపాన‌న్న అనుభూతి త‌న‌కు క‌లిగింద‌న్నారు. చెక్ రిప‌బ్లిక్‌కు వ‌చ్చే వారిలో హైద‌రాబాద్ వారు ఎక్కువ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఫ్యూచ‌ర్లోనూ హైద‌రాబాద్ తో రిలేష‌న్స్ కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.