Begin typing your search above and press return to search.

పాలు లీటర్‌ రూ.100, నీళ్లు రూ.150

By:  Tupaki Desk   |   3 Dec 2015 2:06 PM GMT
పాలు లీటర్‌ రూ.100, నీళ్లు రూ.150
X
తమిళనాడు వరద భీభత్సం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు నాలుగురోజుల చెన్న‌ప‌ట్ట‌ణంలోని పరిస్థితిని చూస్తూ ప్ర‌పంచ‌మే అచ్చెరువు అవుతోంది. వ‌ర‌ద‌, వాన‌లతో అత‌లాకుత‌ల‌మై నరకం అనుభవిస్తున్న చెన్నై న‌గ‌ర‌ ప్రజలకు మ‌రో భారీ షాక్ తగులుతోంది. ర‌వాణ స్తంభించిపోవ‌డం, స‌హాయ సేవ‌లు నిలిచిపోయిన ప‌రిస్థితుల్లో నిత్యావసర వస్తువులు మిన్నంటడంతో అలవికాని కష్టాలను అనుభవిస్తున్నారు.

తిన‌డానికి తిండి... కాస్త ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి కాఫీ, టీల సంగతి ఎలా ఉన్నా పసిబిడ్డలకు పట్టడానికి కూడా పాలు లభ్యం కాని పరిస్థితి నెలకొంది. చివరకు ఎండిపోతున్న నోటిని తడుపుకోవడానికి చుక్క మంచినీరు కరువైంది. హృద‌య‌విదార‌కంగా ఉన్న ఈ ప‌రిస్థితుల్లో వ్యాపారులు విజృంబిస్తున్నారు. లాభం కోసం అమ్ముకోవ‌డం అనేది వ‌దిలేసి దోచుకోవ‌డం మొదలుపెట్టారు.

చెన్నైలో లీటర్‌ పాల ధర 100 రూపాయిలు పలుకుతోంది. సాధారణంగా 20 రూపాయిలకు దొరికే మంచినీళ్ల బాటిల్‌ 150 రూపాయిలకు చేరింది. కూరగాయల సంగతి చెప్పనక్కరలేదు. కూర'గాయాలు'గా మారి ప్రజలను మరింత బాధిస్తున్నాయి. టమాటాలు, బీన్స్‌ వంటి కూరలు 90 రూపాయిలు, అంతకంటే ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తోంది. ఇంత చేసి వాటిని కొనుగోలు చేస్తే....అవి ఇంటికి చేర్చుకోవ‌డానికి అంతే క‌ష్టం అనుభ‌వించాల్సి వ‌స్తోంది.