Begin typing your search above and press return to search.

కోట్లు ఉన్నోళ్లలో భారీగా పెరుగుతున్న మనోళ్లు

By:  Tupaki Desk   |   20 March 2015 4:59 AM GMT
కోట్లు ఉన్నోళ్లలో భారీగా పెరుగుతున్న మనోళ్లు
X
కోట్లాది రూపాయిల ఆస్తిపాస్తుల్ని కూడబెట్టటంలో మనోళ్ల సంఖ్య భారీగా పెరుగతోంది. ఈ విషయాన్ని వాళ్లు.. వీళ్లు కాదు.. నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌ స్పష్టం చేస్తోంది. సంపన్నులు.. అతి భారీ సంపన్నుల సంఖ్య మనదేశంలో రోజురోజుకీ పెరుగతోందని లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు. ఇలా కోట్లాది రూపాయిలు వెనకేసే వారి వృద్ధి రేటు ఏటా 60శాతంతోదూసుకెళుతుందంటే.. మనోళ్ల సంపాదన ఎంత భారీగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

గడిచిన పదేళ్లలో భారతదేశంలో అతి భారీ సంపన్నులు 166శాతం వృద్ధిరేటుతో దూసుకెళుతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. అంతేకాదు.. ఇలాంటి శ్రీమంతులు దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించారు.

ఒక వ్యక్తికి స్వదేశంతో పాటు విదేశాల్లో ఆస్తులు ఉండి.. వాటి మొత్తం విలువ రూ.180కోట్లు ఉన్న వారికి అతి భారీ శ్రీమంతులుగా.. అదే సమయంలో వ్యక్తిగత ఆస్తి విలువ రూ.6కోట్లు ఉంటే వారిని శ్రీమంతులుగా లెక్కిస్తున్నారు.

ఇలాంటి అతి భారీ శ్రీమంతులు గడిచిన పదేళ్లలో 622 మంది నుంచి 1652కు పెరిగినట్లు గుర్తించారు. మరో పదేళ్లలో వీరి సంఖ్య 3371కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక.. భారీ శ్రీమంతుల జాబితాలో దేశంలోని ముంబయి వాసులు అధికంగా ఉంటే.. హైదరాబాదీయులు ఐదో స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. రానున్న పదేళ్లలో అతి భారీ శ్రీమంతుల సంఖ్య హైదరాబాద్‌ వరకే 92 మందికి చేరుకుంటుందని చెబుతున్నారు. మొత్తానికి శ్రీమంతుల్లో భారతీయులు నానాటికీ పెరిగిపోతున్నారనటానికి ఈ గణాంకాలే నిదర్శనమంటున్నారు.