Begin typing your search above and press return to search.

పాతబస్తీలో ‘‘అసద్ మూక’’ ఆరాచకం

By:  Tupaki Desk   |   3 Feb 2016 4:15 AM GMT
పాతబస్తీలో ‘‘అసద్ మూక’’ ఆరాచకం
X
పాతబస్తీలో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉంటాయనే దానికి గ్రేటర్ ఎన్నికలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. పాతబస్తీని తమ రాజ్యంగా భావించి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. తమకు తోచినట్లుగా చెలరేగిపోవటం.. చట్టం.. న్యాయం లాంటివేవీ తమకు పని చేయమని.. తమకు తోచిందే ధర్మంగా వ్యవహరించటం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అలవాటే. తన సొంత ఇలాకాలో తన మాటే చట్టంగా ఆయన వ్యవహరించటం కొత్తేం కాదు. కాకుంటే.. అలాంటి విషయాల్ని రాసే దమ్ము.. దైర్యం ప్రధాన మీడియా సంస్థలు కూడా చేయకపోవటంతో మజ్లిస్ ఆరాచకాలు జాతీయస్థాయిలో చర్చనీయాంశాలు కాలేదు.

చట్టసభల్లో మైనార్టీ హక్కుల మీద అనర్గళంగా మాట్లాడుతూ.. ఈ దేశంలో రాజ్యాంగం పని చేస్తుందా? చట్టమనేది ఒకటి ఉందా? అన్నట్లుగా వీరావేశంలో మాట్లాడే ఓవైసీ బ్రదర్స్.. వాస్తవంలో ఎలా వ్యవహరిస్తారు? ఎంతలా తెగబడతారు? వారి ఆరాచకం ఏ స్థాయిలో ఉంటుందన్నది గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి జంకూ లేకుండా ప్రదర్శించారు.

తమ 20 నెలల పాలనలో సీమాంధ్రుల మీద ఏదైనా దాడి జరిగిందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తుంటారు. నిజమే.. సీమాంధ్రుల మీద ఎలాంటి దాడి జరగలేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయటం.. ఆయన కుమారుడ్ని మజ్లిస్ ఎమ్మెల్యే కొట్టటం చూస్తే.. షాక్ తినాల్సిందే. డిప్యూటీ సీఎం కొడుకునే కొట్టేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరి మీదైనా దాడి చేసేస్తారా? అన్న సందేహం కలగక మానదు.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మొదలు కొని ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎంతగా చెలరేగిపోయారంటే.. శాంపిల్ గా కొన్ని ఘటనల్ని చెబితే వారెంతగా చెలరేగిపోయారనేది ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారులో నుంచి లాగి మరీ కొట్టారు. ఇక.. షబ్బీర్ కు కూడా అలాంటి అవమానమే చోటు చేసుకుంది.

ఇక.. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లోకి మజ్లిస్ మూక చొరబడే ప్రయత్నం చేయగా.. ఆయన కుమారుడ్ని మలక్ పేట మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా కొట్టేశారు. ఇక.. బీజేపీ అభ్యర్థిపై ఎలాంటి మొహమాటం లేకుండా అసదుద్దీన్ సోదరుడు.. మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చితక్కొట్టేశారు. ఇలా తమకు తోచినట్లుగా మజ్లిస్ మూక చెలరేగిపోతుంటే.. పాతబస్తీ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ఒకదశలో చేతులెత్తేశారే తప్పించి.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కనీస ఆలోచన కూడా చేయలేదు.

పోలీసుల దీనస్థితి చూస్తే జాలి వేయాలో.. ఇదేనా పోలీసింగ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయాలో అర్థం కాని దుస్థితి. డిప్యూటీ సీఎం ఇంటి మీద దాడికి యత్నించే ప్రయత్నం చేస్తే.. పోలీసులు పారిపోతే.. టీఆర్ఎస్ నేతలు ప్రతిఘటించటంతో వ్యవహారం అక్కడితే ఆగిందే. లేదంటే.. డిప్యూటీ ముఖ్యమంత్రికి దారుణ అవమానం జరిగి ఉండేది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఇంతటి ఆరాచకాన్ని ప్రదర్శించిన అసద్ అండ్ కో మీద చట్టపరమైన చర్యలు తీసుకోరా? అసద్.. అతడి అనుచరులు రాజ్యాంగానికి అతీతులా? వారి వరకూ ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా పాతబస్తీలో అమలవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు తెలంగాణ సర్కారు తమ చేతలతో సమాధానాలు చెబితే బాగుంటుంది.