Begin typing your search above and press return to search.

జగన్ సీటుకు ఎసరు.. ఎంఐఎం అసదుద్దీన్ సంచలనం!

By:  Tupaki Desk   |   7 March 2021 7:30 AM GMT
జగన్ సీటుకు ఎసరు.. ఎంఐఎం అసదుద్దీన్ సంచలనం!
X
ఎంఐఎం పార్టీ పుట్టి 63 ఏళ్లు అయిన సందర్భంగా ఏపీలో పర్యటించారు ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీకి దిగుతున్న దృష్ట్యా సీఎం జగన్ పై ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఎంఐఎం అధినేత ఓవైసీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ విడుదలైన ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. శనివారం కర్నూలు జిల్లా ఆధోనిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓవైసీ.. కిక్కిరిసిన జనం మధ్యలో నుంచి వెళుతోన్న వీడియోను అసద్ రీట్వీట్ చేశారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో అధోని మున్సిపాలిటీలో 4 వార్డుల్ని గెలుచుకున్న మజ్లిస్.. 2021 మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని స్థానాలపై కన్నేసింది.

2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 34 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం బరిలోకి దిగింది. నాలుగు జిల్లాల్లో పోటీకి దిగుతోంది. కర్నూలు, అనంతపురం, కడప, కృష్ణా జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యూహాత్మకంగా 47 వార్డుల్లో మాత్రమే ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టింది.

కాగా ఆయా స్థానాల్లో హిందువులను సైతం మజ్లిస్ అభ్యర్థులుగా నిలిపింది. పట్టణాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్న ఓవైసీ.. బీజేపీ, వైసీపీని కలిపి టార్గెట్ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ జిగ్రీ దోస్త్ అయినా కూడా అసదుద్దీన్ వదిలిపెట్టలేదు. వైసీపీకి ఓటేయవద్దని.. ఎంఐఎం అభ్యర్థులకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. జగన్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. జగన్ ప్రభుత్వ భూములను అమ్మడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని ఓవైసీపీ స్పష్టం చేశారు.

ఇక సీఎం జగన్ సీటుకు ఎసరు వస్తోందని ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని.. ఈ విషయం పట్టనట్లుగా సీఎం జగన్ కళ్లు మూసుకొని ఉంటే ఆయన సీటుకే ఎసరు వస్తోందని అసదుద్దీన్ హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషయంలో జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలని.. మతోన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేయాలని అన్నారు. ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడుల వెనుక ఉన్నది హిందుత్వవాదులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.