Begin typing your search above and press return to search.

కేటీఆర్ మళ్లీ రావాలన్న అసద్..ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   26 Aug 2019 11:30 AM GMT
కేటీఆర్ మళ్లీ రావాలన్న అసద్..ఏం జరగనుంది?
X
అసద్ అంటే మాటలా? మజ్లిస్ అధినేతగా అందరికి తెలిసినప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయనెంత సన్నిహితుడన్న విషయం.. ఆ మధ్యన జరిగిన ముందస్తు ఎన్నికల వేళలో తెలిసి గులాబీ నేతలు అవాక్కు అయ్యే పరిస్థితి. అసద్ కు.. కేసీఆర్ కు మధ్యనున్న అనుబంధం గురించి.. మజ్లిస్ అధినేత మాటకు గులాబీ బాస్ ఇచ్చే ప్రాధాన్యత గురించి అప్పట్లో పార్టీలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.

అలాంటి అసద్.. తాజాగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మంత్రివర్గంలోకి మళ్లీ రావాలంటూ ట్వీట్ చేశారంటే.. ఏం జరగనుందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరమని చెప్పాలి. తెలంగాణ అధికారపక్షానికి మిత్రుడైన అసద్.. ఇప్పటివరకూ తెలంగాణ పాలక పక్షానికి సంబంధించి.. కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరుండాలన్న విషయం గురించి మాట వరసకు కూడా మాట్లాడింది లేదు.

అలాంటి అసద్.. ఒక ట్వీట్ కు తనకు తానే స్పందించటమే కాదు.. కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్ మళ్లీ రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం అంటే.. ఆయన రీఎంట్రీకి ఎలాంటి అడ్డంకి లేదన్నట్లుగా చెప్పాలి. దసరాకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అసద్ ట్వీట్ ఆసక్తికరంగా మారినట్లే.

ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ఎన్నికల్లో ఘన విజయం సాధించటం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే. అయితే.. ఆయన మంత్రివర్గంలో కేటీఆర్ తో పాటు.. హరీశ్ రావులతో పాటు.. పలువురు సీనియర్లకు కేబినెట్ లో చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవటం.. కేంద్రంలో సమీకరణాలు అంచనాలకు భిన్నంగా రావటంతో కేసీఆర్ ప్లాన్ మొత్తం తేడా కొట్టిందన్న ప్రచారం ఉంది.

ఇలాంటివేళ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ ను మళ్లీ మంత్రివర్గంలో తీసుకురావటం ద్వారా.. ఆయన్ను పాలనలో నేరుగా భాగస్వామిని చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకే పరిమితమైన కేటీఆర్.. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందన్న ప్రచారం గురించి తెలిసిందే. ఇలాంటివేళ.. అసద్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

హైదరాబాద్ నగరానికి గత ఏడాది ఒప్పో.. ఇటీవల అమెజాన్.. తాజాగా వన్ ప్లస్ వచ్చిందంటూ ఒక జర్నలిస్టు ట్వీట్ చేయగా.. దానికి స్పందించిన అసద్.. దిగ్గజ కంపెనీల రాకతో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్నట్లుగా పేర్కొన్నారు. అనూహ్యంగా ఆ క్రెడిట్ ను కేసీఆర్ ఖాతాలో వేయని అసద్.. అదంతా కేటీఆర్ ఘనతగా ప్రశంసించటం విశేషం. ఆయన ప్రభుత్వంలోకి రావాలని కోరుకున్నట్లుగా ట్వీట్ చేశారు.

అసద్ అడిగితే కేసీఆర్ ఏదీ కాదనరని.. అలాంటిది తన కొడుకు తరఫున అసద్ మాట్లాడటం.. ఆయన ఘనతను చెప్పటం.. మంత్రివర్గంలో మళ్లీ రావాలని ఆకాంక్షించిన తర్వాత గులాబీ బాస్ ఊరుకుంటారా? వీలైతే.. దసరా ముందే మంత్రివర్గంలోకి కేటీఆర్ ను చేర్చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంటారేమో?