Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్‌ పై ఎంఐఎం కన్ను

By:  Tupaki Desk   |   1 Sept 2018 11:00 PM IST
జూబ్లీహిల్స్‌ పై ఎంఐఎం కన్ను
X
హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసే ఎంఐఎం పార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలోనూ ఇటీవల ఎన్నికల్లో గెలిచిన సంగతి తెలిసిందే. పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ ఇప్పుడు తనకు ఆయువు పట్టయిన హైదరాబాద్‌ లో మరిన్ని సీట్లకు విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌ లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

పాతబస్తీలో పట్టున్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ సహా మరో రెండు నియోజకవర్గాలపై కన్నేసింది. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ - అంబర్ పేట - రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన కార్యాచరణను మొదలు పెట్టారని సమాచారం. టీఆర్ ఎస్ పార్టీతో పొత్తు ఉంటే జీహెచ్ ఎంసీ డివిజన్ల ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని టీఆర్ ఎస్‌ ను కోరాలనుకుంటున్నారట.

ఎంఐఎం జూబ్లీహిల్స్‌ పై మనసు పడడానికి కారణం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. అంబర్ పేట - రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎంకు ఓట్లు బాగానే పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో మరింత విస్తరించేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. అయితే... టీఆరెస్ - బీజేపీ కలిసి సాగితే మాత్రం అసద్ కలలకు బ్రేకు పడడం ఖాయం. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకున్నా హైదరాబాద్‌ కు గుండెకాయ లాంటి జూబ్లీహిల్స్‌ ను కేసీఆర్ వదులుకుంటారా అన్నది అనుమానమే.