Begin typing your search above and press return to search.

ఆ ముస్లింలు ఎంఐఎంను దూరంపెట్టారు

By:  Tupaki Desk   |   21 Jan 2016 8:04 AM GMT
ఆ ముస్లింలు ఎంఐఎంను దూరంపెట్టారు
X
ఆల్ ఇండియా మ‌జ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం). హైద‌రాబాద్‌ ను ఇలాకా చేసుకొని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌నుకుంటున్న పార్టీ. ఇన్నాళ్లు ముస్లింల‌తో క‌లిసి రాజ‌కీయాలు చేసిన ఈ పార్టీ ఇటీవ‌లి కాలంలో ఎస్సీల‌ను చేర‌దీస్తోంది. అయితే ముస్లింల త‌మ ప‌క్కా ఓటు బ్యాంకుగా భావించి, హైద‌రాబాద్ త‌మ అడ్డాగా ఫీల‌యిన ఈ పార్టీ ఎదిగింది. అయితే ఆ ముస్లింలే ఎంఐఎంను అడుగుపెట్ట‌నివ్వ‌ని ఏరియా ఒక‌టుంది. అది కూడా హైద‌రాబాద్‌ లో కావ‌డం ఇక్క‌డ అస‌లు ట్విస్ట్‌.

హైదరాబాద్ - సికిందరాబాద్‌ లకు మధ్యలో ఉన్న ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భోలక్‌ పూర్‌ లోని ఓ మున్సిపల్ వార్డు ఇది. భోలక్‌ పూర్ పేరుతో మున్సిపల్ వార్డు ఉన్నా, ఎన్నికల ఫలితాలు నిర్ణయించేది మాత్రం ఇక్క‌డ నివ‌సించే బంగ్లాదేశీయులే. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో కాందిశీకులుగా వచ్చిన వేలాదిమంది బంగ్లాదేశీయులు భోలక్‌ పూర్‌ లో నివాసం ఏర్పరచుకున్నారు. వీరిలో చాలామంది బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. అందుకే ఈ కాలనీకి బంగ్లాదేశ్ అని పేరొచ్చింది. వీరు నడిపే బట్టల దుకాణాలకు కూడా డిమాండ్ ఎక్కువే. ధర తక్కువ - తానుల్లో కాకుండా ముక్కలుగా లభించడంతో బీదా బిక్కీ ఈ దుకాణాలకే వస్తూంటారు.

ఇక్కడ మైనారిటీలే మెజారిటీలు. ఎంతగా అంటే ఎంఐఎంను సైతం కాలు పెట్టనివ్వకుండా తామే ఒక అభ్యర్థిని ఇండిపెండెంట్‌ గా పోటీ చేయించి గెలిపించుకున్నారు. 1986లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం వంద వార్డులు ఉంటే ఒకే ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అది భోలక్‌ పూర్ వార్డు! హైదరాబాద్ నగరంలో మత కలహాలు జరిగిన సమయంలో కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం విశేషం!! సుమారు తొమ్మిదేళ్ల కిందట తోళ్ల శుద్ధి పరిశ్రమల వల్ల తాగునీరు కలుషితం కావడంతో ఐదుగురు మరణించిన సంఘటన జరిగింది ఇక్కడే. ఇదే ట్రెండ్‌ ను ఈ ద‌ఫా కొన‌సాగించాల‌ని భావించిన‌ప్ప‌టికీ ఇటు ఎంఐఎం, అటు అధికార టీఆర్ ఎస్ వైపు నాయ‌కులు చీలిపోయారు. అయితే ఎంఐఎంకంటే టీఆర్ ఎస్ వైపే మెజార్టీ బంగ్లాదేశీ మూలాలున్న పౌరులుండ‌టం కొస‌మెరుపు.