Begin typing your search above and press return to search.

‘ఐ లవ్ మై ఇండియా’ అంటూ మజ్లిస్ కటౌట్లు

By:  Tupaki Desk   |   29 March 2016 5:55 AM GMT
‘ఐ లవ్ మై ఇండియా’ అంటూ మజ్లిస్ కటౌట్లు
X
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. దుందుడుకుగా వ్యవహరించటం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన సోదరుడు కమ్ తెలంగాణ మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలకు మామూలే. కానీ.. వారు ఎప్పుడూ లేనంత డిఫెన్స్ లో పడిపోయారు. తమకు తోచించి.. మనసుకు నచ్చింది అనేయటమే కానీ ఆ తర్వాత దానికి వివరణ ఇవ్వటం.. క్షమాపణలు చెప్పటం లాంటివి వారి హిస్టరీలో కనిపించవు. అలాంటి ఓవైసీ తొలిసారి ఆత్మరక్షణలో పడ్డారా? తన ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయినట్లు భావిస్తున్నారా? అన్న సందేహం కలిగేలా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయి.

ఆ మధ్య మహారాష్ట్రకు వెళ్లిన అసద్.. తన గొంతు మీద కత్తి పెట్టినా.. భారత్ మాతాకీ జై అనే మాట తాను అనని అనటం సంచలనంగా మారితే.. ఆయన పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యనే చేసి సస్పెండ్ కావటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలపైనా.. చర్యల మీదా పెద్ద ఎత్తున చర్చ మొదలైతే.. సోషల్ మీడియాలో అంతే స్థాయిలో రచ్చ సాగుతోంది. ఇక.. అసద్ వ్యాఖ్యలపై ముస్లింలు సైతం వ్యతిరేకించారు. కొంత మంది ముస్లింలు అయితే.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసి అసద్ తీరును ఎండగట్టారు.

ఇంత జరుగుతున్నా.. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ కానీ విచారం కానీ అసద్ చేసింది లేదు.నిజానికి అలాంటి అలవాటు అసద్ కు లేదనే చెప్పాలి. కానీ.. అనూహ్యంగా హైదరాబాద్ మహానగరిలోని పలు ప్రధాన కూడళ్లలో భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ‘‘ఐ లవ్ మై ఇండియా’’.. ‘‘హిందుస్థాన్ జిందాబాద్’’ అన్న నినాదాలు.. ఆకుపచ్చ మోచేయి.. తెలుపు అరచేయి.. కాషాయం వేళ్లతో బిగించిన పిడికిలి బిగించిన ఉన్న ఫోటో.. అసదుద్దీన్.. అక్బరుద్దీన్ ఓవైసీ ఫోటోలతో పాటు పార్టీకి చెంది నేతల ఫోటోలతో కూడిన భారీ కటౌట్లు గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. మజ్లిస్ తాజాగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు చూస్తేనే.. భారత్ మాతాకీ జై ఇష్యూలో అసద్ ఎంతలా డిఫెన్స్ లో పడ్డారో ఇట్టే తెలుస్తుందని చెప్పొచ్చు.