Begin typing your search above and press return to search.

ఏపీలోని నాలుగు స్థానాల‌పై ఎంఐఎం ఫోక‌స్‌

By:  Tupaki Desk   |   29 Nov 2016 5:30 PM GMT
ఏపీలోని నాలుగు స్థానాల‌పై ఎంఐఎం ఫోక‌స్‌
X
పాత‌బ‌స్తీకి ప‌రిమిత‌మైన పార్టీ అనే ముద్రను తొల‌గించుకొని జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటుకోవాల‌ని చూస్తున్న ఎంఐఎం పార్టీ ఇపుడు పొరుగు రాష్ట్రంపై క‌న్ను వేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్‌ - కార్పొరేషన్ల ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో హవా చూపించిన ఎంఐఎం పార్టీ నాయకత్వం ఇప్పుడు అదే హవాను ఏపీలోనూ చూపాలని సమాలోచనలు చేస్తోంది. ఏపీలో కర్నూలు - తిరుపతి - శ్రీకాకుళం గ్రేటర్‌ విశాఖ - కాకినాడ - గుంటూరు - ఒంగోలు మున్సిపల్‌ కార్పోరేషన్లకు - రాజంపేట - రాజమండ్రి. నెల్లిమర్ల - కందుకూరు మున్సిపాలిటీలకు పలు కారణాల వల్ల ఇంత వరకు ఎన్నికలు జరగని విషయం తెలిసిందే. పెండింగ్‌ లోనున్న మున్సిపల్‌ - కార్పోరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై దృష్టి ఎంఐఎం నాయత్వం దృష్టిసారిస్తోంది.

2014 ఎన్నికలకు ముందు తెలంగాణలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎంఐఎం హవా చూపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని పలు మున్సిపాలిటీ - కార్పొరేషన్లలో వైస్‌ ఛైర్మన్‌ - డిప్యూటీ మేయర్‌ పదవులను కూడా ఆ పార్టీ సాధించుకొంది. అనంత‌రం మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకొన్న మజ్లిస్‌ నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాంలోనూ తనకు మున్ముందు ఎదిగేందుకు పుష్కల అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ ఆయా మున్సిపాలిటీ - కార్పొరేషన్లలో పాగా వేయాలని చూస్తోంది. తద్వారా అక్కడ స్థానికంగా పట్టు ఏర్పరుచుకోవాలని ఆ పార్టీనాయకత్వం భావిస్తోంది. ఈ రకంగాను మున్ముందు పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో కీలకమైన శక్తిగా ఏర్పరచాలని ఆ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది.త్వరలో ఎన్నికలు జరిగే కర్నూలు - గుంటూరు - గ్రేటర్‌ విశాఖ - ఒంగోలుతో పాటు పలు మున్సిపాలిటీలలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. ఇలా ముస్లిం జనాభా అధికంగా ఉన్న కార్పోరేషన్‌ - మున్సిపాలిటీ వార్డులపై ఎంఐఎం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.

ఏ పార్టీ అయిన మనుగడ సాధించాలంటే స్థానికంగా పట్టు సాధించడం ముఖ్యం. ఈ వాస్తవాన్ని గుర్తించిన ఎంఐఎం పార్టీ నాయకత్వం పార్టీ విస్తరణ కోసం ముందు పార్టీని అన్ని రాష్ట్రాలలో స్థానికంగా విస్తరింపజేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో పార్టీ పరంగా విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా బస్తీ కమిటీలు వేయడంతోపాటు వచ్చే మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికలలో ఇప్పటి నుంచే వివిధ డివిజన్ల - వార్డుల కార్పోరేటర్‌ - కౌన్సిలర్‌ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో మజ్లిస్‌ నాయకత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముస్లిం జనాభా యాభైశాతానికి పైగా ఉన్న చోట్లు ముస్లిం అభ్యర్థులను మెజార్టీ జనాభా ఉండి ఇతర వర్గాల సహాయంతో అక్కడ ఎన్నికల్లో గెలవచ్చన్న పరిస్థితి ఉంటే ముస్లిమేతర అభ్యర్థిని బరిలోకి దించాలని ఎంఐఎం నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఇలా తన పార్టీపై ఉన్న ముస్లిం మత ముద్రను తొలగించుకొనే ప్రయత్నం ఎంఐఎం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ముస్లిమేతర అభ్యర్థులను ఎంపిక చేసి తనపై మత పార్టీ అని వేలెత్తిచూపే వారిని సమాధానం ఇచ్చే అవకాశముంటుందని మజ్లిస్‌ నాయకత్వం భావిస్తోంది.

ఇదిలావుంటే స్థానికంలో పట్టు సాధించేందుకు వీలుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆ పార్టీ యోచిస్తోంది. స్థానికంగా ఏర్పడిన చిన్నచిన్న సమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారానికి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. అప్పుడే స్థానికంగా ప్రజాద‌రణ పార్టీకి దక్కుతుందని ఎంఐఎం సమాలోచనలు చేస్తోంది. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలు ఎలా చేపట్టాలని ఆ పార్టీ అంతర్మథనం చేస్తోంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం ఎత్తడం తప్పా ఇంతవరకు వీధి పోరాటాలు చేసిన సందర్భాలు ఎంఐఎంకు లేదు. ఆ పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలో ఆందోళనలు చేపట్టి పాత బస్తీ లాంటి ప్రాంతంలో ఎంఐఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో సైతం చర్చాంశనీయం కాబోతోంది. పాతబస్తీలోని ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం పార్టీ ఏ ఒక్క ప్రజా సమస్యపై గళం ఎత్తిన సందర్భాలు లేవు. ఈ క్రమంలో పార్టీ విస్తరణ కోసం ఎంఐఎం ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు ఎలా ఉంటాయో వేచిచూడక తప్పని పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/