Begin typing your search above and press return to search.

ఒవైసీ లెక్క ఎంత‌? 100 సీట్ల‌లో 20 అయినా గెలిచేనా?

By:  Tupaki Desk   |   23 Jan 2022 2:30 AM GMT
ఒవైసీ లెక్క ఎంత‌?  100 సీట్ల‌లో 20 అయినా గెలిచేనా?
X
జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ముస్లిం ఓటు బ్యాంకే కీలకం. ఈ నేపథ్యంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, తిరిగి పగ్గాలు చేపట్టేందుకు అఖిలేశ్.. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇరుపార్టీలు తమ సంప్రదాయ ఓటుబ్యాంక్‌ను పదిలం చేసుకుంటూ.. వందకుపైగా స్థానాల్లో ప్రాబల్యం చూపే ముస్లిం ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే.. ఈ 100 స్థానాల‌ను త‌మ సొంతం చేసుకుంటామ‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ చెబుతున్నారు.

ఇప్ప‌టికే 100 స్థానాల్లో క‌లిసి వ‌చ్చిన పార్టీల‌తో క‌లిసి ఆయ‌న జాబితా సిద్ధం చేసుకున్నారు. కానీ, ఈ వంద స్థానాల్లో ఒవైసీ ప్ర‌భావం ఎంత‌? క‌నీసం 20 చోట్ల అయినా.. త‌న ప‌ట్టు నిల‌బెట్టుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. ఒవైసీ వ్యూహం చెదిరిపోతే.. ఇది ఎవ‌రికి లాభిస్తుంది? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. గ‌తంలో పోటీ చేసిన చోట్ల ఒక్క‌టంటే ఒక్క స్థానం కూడా ఒవైసీ కూట‌మి ద‌క్కించుకోలేక పోయింది. మ‌రి ఇప్పుడు ఏకంగా 100 స్థానాల‌పై గురి పెట్టారు. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? ఒవైసీని బీజేపీ టార్గెట్ చేయ‌క‌పోగా.. క‌నీసం.. ఆయ‌న ఊసు కూడా ఎత్త‌డం లేదు. దీంతో రాష్ట్రంలో ఒవైసీ రాజ‌కీయాల‌పై అనేక సందేహాలు.. అదేస‌మ‌యంలో చ‌ర్చ‌లు వ‌స్తున్నాయి.

గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ముస్లింల ప్రాతినిధ్యం పెరిగిన ప్రతిసారి బీజేపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1991లో 221స్థానాలతో బీజేపీ మొదటిసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు ముస్లిం ఎమ్మెల్యేలు 23మంది గెలుపొందారు. బీజేపీ బలం తగ్గిన ఎన్నికల్లో ముస్లింల పట్టు పెరిగింది. 2012లో సమాజ్‌వాదీ పార్టీ 224 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, 68 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.

అప్పుడు బీజేపీ కేవలం 47 చోట్ల గెలిచింది. 2017లో బీజేపీ 312 సీట్లు గెలిస్తే.. ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 23కు పరిమితమైంది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న బీజేపీ నేత‌లు.. ఈసారి ముస్లింల ప్రాతినిధ్యం పెరగకుండా ఎత్తులు వేస్తున్నారు. అందుకే ఒవైసీని వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.


2017లో 38 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన ఒవైసీ.. ఒక్క స్థానం కూడా గెలువలేకపోయారు. ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరింది. ఈసారి 100స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఓవైసీ ప్రకటించటంతో అప్రమత్తమైన ఎస్పీ అందుకు అనుగుణంగా ఎన్నికల తంత్రాన్ని అమలు చేయటంపై దృష్టి సారించింది. ఈసారి ద్విముఖ పోటీ నెలకొన్న తరుణంలో ముస్లింలు ఏ పార్టీని అందలం ఎక్కిస్తారన్నది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు ఒవైసీని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.