Begin typing your search above and press return to search.

యూపీలో ఎంఐఎం రాజ‌కీయం.. ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   25 July 2021 12:30 PM GMT
యూపీలో ఎంఐఎం రాజ‌కీయం.. ఏం జ‌రుగుతోంది?
X
దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్ లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అయితే.. ఎన్నిక‌ల‌ రాజ‌కీయం మాత్రం అప్పుడే మొద‌లైంది. పార్టీలు ఇప్ప‌టి నుంచే పోరాటం మొద‌లు పెట్టాయి. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన బీజేపీకి.. ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితులే ఎదుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో.. ఆ పార్టీ ఓట్ల చీలిక‌పైనే ఆధార‌ప‌డుతోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో విప‌క్షాల‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ఈ సారి ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ విడి విడిగానే పోటీ చేయ‌బోతున్నాయి. అయితే.. తాము కూడా రేసులో ఉన్నామ‌ని ప్ర‌క‌టించుకుంది ఎంఐఎం పార్టీ. కింగ్ కాలేక‌పోయినా.. కింగ్‌ మేక‌ర్ కావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి కార‌ణం.. ఆ రాష్ట్రంలో ముస్లిం జ‌నాభా భారీగా ఉండ‌డ‌మే. మ‌తం పేరుతో వారంద‌రినీ త‌మ పార్టీవైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది ఎంఐఎం. ఈ క్ర‌మంలో యూపీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన అధినేత అస‌దుద్దీన్‌.. త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ ప్ర‌య‌త్నాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంద‌ని జాతీయ మీడియా హోరెత్తించింది.

ఆ మ‌ధ్య బీఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు అస‌దుద్దీన్ ప్ర‌య‌త్నించారు. కానీ.. మాయావతి నో చెప్పారు. దీంతో.. ఆ రాష్ట్రంలోని చిన్నా చితకా పార్టీల‌తో జ‌ట్టుక‌డుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు అస‌దుద్దీన్‌. మొత్తం 9 పార్టీలు క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. భాగీదారీ సంకల్ప్ మోర్చా (బీఎస్ఎం) పేరిట ఏర్ప‌డిన ఈ కూట‌మి త‌ర‌పున తాము వంద సీట్ల‌కు పైగా పోటీ చేయ‌నున్న‌ట్టు ఎంఐఎం ప్ర‌క‌టించింది.

అయితే.. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. స‌మాజ్ వాదీ పార్టీతో ఎంఐఎం పొత్తు కుదిరింద‌ని వార్త‌లు ప్ర‌సార‌మ‌య్యాయి. ష‌ర‌తుల‌తో కూడిన పొత్తు ఓకే అయ్యింద‌ని, గెలిస్తే.. ముస్లింల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌న్న అస‌దుద్దీన్ ప్ర‌తిపాద‌న‌కు అఖిలేష్ ఓకే చెప్పార‌ని కూడా ప్ర‌న‌చారం సాగింది. ఆగ‌స్టు మొద‌టి వారంలో అస‌దుద్దీన్ యూపీలో ప‌ర్య‌టించి, పొత్తును ఫైన‌ల్ చేస్తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో.. యూపీ రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. అయితే.. ఆ పార్టీ నేత‌లు ఈ వార్త‌ల‌ను ఖండించారు. మ‌జ్లిస్ యూపీ అధ్య‌క్షుడు షౌక‌త్ అలీ మాట్లాడుతూ.. అలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో.. ఆ వార్త‌ల‌కు తెర‌ప‌డిన‌ట్టైంది.

కాగా.. యూపీలో మొత్తం 404 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. దాదాపు 112 నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లిం ఓట‌ర్లు దాదాపు 40 శాతం వ‌ర‌కు ఉన్నారు. ఇందులోనే 51 నియోజ‌క‌వ‌ర్గాల్లో 50 శాతానికిపైగా ఉన్నారు. ఈ ఓట్ల‌న్నీ త‌మ‌వైపు తిప్పుకోవ‌డం ద్వారా యూపీలో స‌త్తా చాటాల‌ని ఎంఐఎం భావిస్తోంది. కొంత కాలం క్రితం వ‌ర‌కు హైద‌రాబాద్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఎంఐఎం.. మహారాష్ట్ర‌లో పోటీ చేసి రెండు ఎంపీ సీట్లు సాధించింది. బీహార్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెల‌చుకుంది. మొన్న‌టి బెంగాల్లో ప‌రాభ‌వం ఎదుర్కొంది. ఇప్పుడు యూపీలో స‌త్తా చాటాల‌ని చూస్తోంది. అయితే.. విప‌క్షాల చీలిక‌ల‌తో ఓట్లు చీల‌డం ద్వారా బీజేపీకే మేలు జ‌రుగుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు.. మజ్లిస్ పార్టీని బీజేపీ ‘బీ టీమ్‌’ అని కూడా విమర్శిస్తారు. ఓట్లు చీల్చడం ద్వారా ఆ పార్టీని గెలిపిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి, యూపీలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.