Begin typing your search above and press return to search.

ఏపీపై ఎంఐఎం స్పెష‌ల్ ఫోక‌స్‌

By:  Tupaki Desk   |   2 March 2017 5:30 PM GMT
ఏపీపై ఎంఐఎం స్పెష‌ల్ ఫోక‌స్‌
X
పాతబ‌స్తీకే ప‌రిమిత‌మైన పార్టీగా కాకుండా దేశ‌వ్యాప్తంగా విస్త‌రించి త‌మ స‌త్తా చాటుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఎంఐఎం పార్టీ నేత‌లు ఇపుడు త‌మ టార్గెట్ గా ఏపీని డిసైడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో తెలంగాణలో హవా చూపించిన ఎంఐఎం నాయకత్వం ఇప్పడు అదే హవాను ఏపీలోనూ చూపాలని సమాలోచనలు చేస్తోంది. ఏపీలో పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కర్నూలు - తిరుపతి - శ్రీకాకుళం గ్రేటర్ విశాఖ - కాకినాడ - గుంటూరు - ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్లకు - రాజంపేట - రాజమండ్రి. నెల్లిమర్ల, కందుకూరు మున్సిపాలిటీలకు పలు కారణాల వల్ల ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై ఎంఐఎం నాయక‌త్వం దృష్టిసారిస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బోణీ కొట్ట‌డం, అంత‌కుముందు మహారాష్ట్రలోనే రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకొన్న మజ్లీస్ నాయకత్వం ఇప్పడు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలోనూ తనకు మున్ముందు ఎదిగేందుకు పుష్కల అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పాగా చేయాలని భావిస్తోంది. తద్వారా అక్కడ స్థానికంగా పట్టు ఏర్పరుచుకోవాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణ‌యించింది. ఈ రకంగాను మున్ముందు పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో కీలకమైన శక్తిగా తీర్చిదిద్దాలని అగ్ర‌నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి స‌త్తా చాటాలంటే స్థానిక ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం ముఖ్యమ‌నే వాస్తవాన్ని గుర్తించిన ఎంఐఎం పార్టీ నాయకత్వం పార్టీ విస్తరణ కోసం ముందు త‌మ భావ‌జాలంతో క‌లిసి న‌డిచే వారిపై దృష్టి సారించిన‌ట్లు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో పార్టీ పరంగా విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా బస్తీ కమిటీలు వేయడంతోపాటు వచ్చే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలలో ఇప్పటి నుంచే వివిధ డివిజన్ల వారుల కార్పోరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో మజ్లీస్ నాయకత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముస్లిం జనాభా యాభైశాతానికి పైగా ఉన్న చోట్ల ముస్లిం అభ్యర్థులను, ఇతర వర్గాలదే మెజార్టీ జనాభా ఉండి అక్కడ గెలవచ్చన్న పరిస్థితి ఉంటే ముస్లిమేతర అభ్యర్థిని బరిలోకి దించాలని ఎంఐఎం నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఇలా తన పార్టీపై ఉన్న ముస్లిం మత ముద్రను తొలగించుకొనే ప్రయత్నం ఎంఐఎం చేస్తోందని స‌మాచారం.

ఇదిలా ఉంటే స్థానికంలో పట్టు సాధించేందుకు వీలుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆ పార్టీ యోచిస్తోంది. స్థానికంగా ఏర్పడిన చిన్నచిన్న సమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారానికి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. అప్పుడే స్థానికంగా ప్రజాద‌రణ పార్టీకి దక్కుతుందని ఎంఐఎం సమాలోచనలు చేస్తోంది. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలు ఎలా చేపట్టాలని ఆ పార్టీ అంతర్మథ‌నం చేస్తోంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం ఎత్తడం తప్ప ఇంతవరకు వీధి పోరాటాలు చేసిన సందర్భాలు ఎంఐఎంకు లేదు. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలో ఆందోళ‌నలు చేపట్టి త‌మ ఇలాకా అయిన‌ పాతబస్తీలోని సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో సైతం చర్చాంశనీయంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/