Begin typing your search above and press return to search.

ఏపీలో ఎంఐఎం చేస్తున్న ప‌ని ఇదే

By:  Tupaki Desk   |   8 Jan 2019 4:52 AM GMT
ఏపీలో ఎంఐఎం చేస్తున్న ప‌ని ఇదే
X
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రిటర్న్‌ గిఫ్ట్ సిద్ధం అవుతోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మహాకూటమి పేరుతో అడుగుపెట్టినందుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన తన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం ఓటర్లను ఆకర్షించి వారిని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ వైపునకు తిప్పేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం ముందుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని రంగంలోకి దింపుతున్నారు. రెండు రోజుల క్రితం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మేకపాటి గౌతం రెడ్డి హైదరాబాద్ లో కలుసుకున్నారు. వీరిద్దరు దాదాపు మూడు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు చెబుతున్నారు. మేకపాటి గౌతం రెడ్డి, ఎంఐఎం అధినేత అసద్దుద్దీన్ ఒవైసీ ఇద్దరు మంచి మిత్రులు. దాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చంచేందుకు వీరు కలిసారని అంటున్నారు.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని ఇంతకు ముందు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైనీ ప్రకటించారు. దీంతో వీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తారని తేలిపోయింది. ఇందులో భాగంగానే మేకపాటి గౌతం రెడ్డి, ఎంఐఎం అధినేతల కలయిక జరిగిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏఏ నియోజకవర్గాల్లో ముస్లీములున్నారు, వారితో ఎప్పుడు చర్చలు జరపాలి వంటి అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో ముస్లీం నాయకులు, యువకులతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు అ్బరుద్దీన్ ఒవైసీ నేరుగా సమావేశాలు జరుపుతారని అంటున్నారు. వీరిద్దరితో పాటు పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఇతర ముస్లీం నాయకులతో కలిసి సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తొలుత ముస్లీముల చేతే రిటన్ గిఫ్ట్ ఇచ్చేందుకు కె.చంద్రశేఖర రావు వ్యూహ రచన చేస్తున్నారనంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఒవైసీని ఆంధ్ర‌ప్రదేశ్ పంపించాల‌న్న‌ది తెలంగాణ మ‌ఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు వ్యూహంగా చెబుతున్నారు.