Begin typing your search above and press return to search.

మైండ్ గేమ్ : అపోజిషన్ గురించి జగన్ అలా...?

By:  Tupaki Desk   |   8 July 2022 12:30 PM GMT
మైండ్ గేమ్  : అపోజిషన్ గురించి జగన్ అలా...?
X
ఏపీలో హోరా హోరీ పోటీ వచ్చే ఎన్నికల్లో ఉంటుంది అన్నది రాజకీయం తెలిసిన వారికి అందరికీ అర్ధమవుతున్న విషయం. అయిదేళ్ళ పాటు ప్రభుత్వం నడిపిన పార్టీకి సహజంగానే జనాలలో వ్యతిరేకత ఎంతో కొంత ఉండడం ఖాయం. అయితే దాన్ని అధిగమించి అధికారంలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇక వైసీపీ సర్కార్ తీరు చూసుకుంటే మూడేళ్ళు నిండగానే వ్యతిరేకత కనిపిస్తోంది.

దానికి తగినట్లుగా విపక్షాలు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా జనాలు వెల్లువలా వస్తున్నారు. చంద్రబాబు సైతం ఊహించని విధంగా ఆయన సభలకు జనాలు హాజరవుతున్నారు. ఒక విధంగా దీన్ని బట్టి జనం మూడ్ చేంజ్ అవుతోంది అని భావించాలి. కానీ జగన్ అయితే మాత్రం ఇదంతా ట్రాష్ అనేస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షం ఎక్కడ ఉంది అని ఆయన నిలదీస్తున్నారు.

ఉన్నదంతా ఏకపక్షమే. జనమంతా మన పక్షమే అని ఆయన నిబ్బరంగా చెబుతున్నారు. వైసీపీ ప్లీనరీలో జగన్ అన్న మాటలు ఒక విధంగా చూస్తే ఆత్మ విశ్వాసంతో కూడుకున్నవైనా అదే టైమ్ లో విపక్షం మీద మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే మనకు పోటీ లేదు, ఎదురే లేదు అని ధీమాతో కూడిన స్పీచ్ ని జగన్ ఇచ్చారు.

టీడీపీ అసలు ఎక్కడ వుంది. ఆ పార్టీ ఉన్నది కేవలం ఎల్లో మీడియా టీవీలలోనే, ఎల్లో పేపర్లలో తప్ప జనంలో లేదు అని లైట్ తీసుకున్నారు జగన్. ఇక జనసేనను అయితే దత్తపుత్రుడు అంటూ ఆయన టీడీపీ గాటను కట్టేసారు. దాంతో ఏపీలో విపక్షం అన్నది లేనే లేదు అని ఆయన చెప్పేశారు. ఇక తనకు అనుకూల మీడియా లేకపోయినా బలమైన పార్టీ కార్యకర్తలు, నమ్మిన ప్రజలు దేవుడు ఉన్నారని ఆయన అంటున్నారు.

అంటే ఏపీలో అధికారంలోకి మళ్ళీ తామే వస్తున్నామని జగన్ చెప్పారన్న మాట. ఇవన్నీ బాగానే ఉన్నా విపక్ష అసలు లేదు అనడమేంటి అన్నదే ఇక్కడ చర్చ. ఎంత కాదనుకున్నా టీడీపీ బలమైన పార్టీ. చంద్రబాబు రాజకీయ గండరగండడు. ఆయన వ్యూహాలు చాలానే ఉంటాయి. కసిగా బాబు పనిచేస్తారు. 2024 ఎన్నికలు అన్నవి టీడీపీకి ప్రాణప్రదమైనవి. చావో రేవో తేల్చుకుంటారు కూడా.

అందువల్ల టీడీపీని లైట్ తీసుకోవడం అంటే వైసీపీ వ్యూహాత్మకంగా తప్పు చేస్తున్నట్లే లెక్క. అయితే జగన్ కూడా క్యాడర్ కి భరోసా కోసమె అలా చెప్పి ఉంటారని అంటున్నారు. అదే టైమ్ లో విపక్షం లేదు అని చెప్పడం, వారికి జనాల మద్దతు లేదు అని పదే పదే అండం ద్వారా అపొజిషన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్నదే జగన్ ఎత్తుగడ అంటున్నారు. ఒక విధంగా మైండ్ గేమ్ లో భాగమే ఇది అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ ఫలిస్తుందో. మనకు ఎదురులేదు అని కూర్చుంటే చివరికి అది వైసీపీకి బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు.